కబడ్దార్... మూల్యం చెల్లించుకోక తప్పదు: టిడిపి నాయకుల హత్యపై చంద్రబాబు సీరియస్

By Arun Kumar PFirst Published Jun 17, 2021, 12:09 PM IST
Highlights

ప్రభుత్వం అండదండలతో ప్రతిపక్ష టిడిపి నాయకులను వైసిపి మూకలు పట్టపగలే  హతమారుస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 

అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యాకాండకు వైసిపి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఖబడ్దార్... రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు...గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు. టిడిపి కార్యకర్తలపై జరుగుతున్న దాష్టీకానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇందుకు బాధ్యులైన వైసిపి నేతలు, పోలీసు అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. 

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో టిడిపి నాయకులు వడ్డి నాగేశ్వర రెడ్డి, వడ్డి ప్రతాప్ రెడ్డిల దారుణ హత్యలపై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పట్టపగలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హతమారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్లు... అసలు పనిచేస్తుందో లేదో అనుమానం కలుగుతోందంటూ చంద్రబాబు  ఆగ్రహం వ్యక్తంచేశారు.   

''పెసరవాయి మాజీ సర్పంచ్, టిడిపి నాయకుడు వడ్డి నాగేశ్వరరెడ్డి, సహకారసంఘం మాజీ అధ్యక్షుడు వడ్డి ప్రతాపరెడ్డి తమ బంధువు చిన్నదినం కార్యక్రమానికి వెళ్లి శ్మశానం నుంచి తిరిగి వెలుతుండగా ప్రత్యర్థివర్గం కారుతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. ఈ హత్యల వెనుక వైసిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి'' అని అన్నారు. 

read more  

''ఇటువంటి ఫ్యాక్షనిస్టు పోకడలతో సమాజానికి ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రజల మాన,ప్రాణాలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ తొత్తుగా మారి పూర్తిగా నిర్వీర్యమైంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 30మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు, 1500కుపైగా టిడిపి నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం ఘటనలు చోటుచేసుకున్నాయి, అయినా పోలీసులు ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది'' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇటువంటి అవాంఛనీయ పరిస్థితులు లేవు. ప్రత్యర్థుల దాడిలో మృతిచెందిన నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా. వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది'' అంటూ చంద్రబాబు ధైర్యం చెప్పారు. 

click me!