
President Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. డిసెంబరు 26న నంద్యాల జిల్లాలోని పవిత్ర శ్రీశైలం ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తొలిసారిగా మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. డిసెంబరు 26న ఆలయాన్ని సందర్శించిన అనంతరం అదే రోజున 'ప్రసాద్ స్కీమ్' అనే పథకాన్ని ప్రారంభించనున్నారు.
ప్రసాదం పథకం (ప్రసాద్ స్కీమ్) కింద రూ.43 కోట్లతో ఆలయ పట్టణంలో శుద్ధి చేసిన తాగునీటి పథకం, లైటింగ్, రోడ్లు వెడల్పు చేయడంతో పాటు యాత్రికులకు సౌకర్యాలు కల్పించేందుకు పర్యాటక శాఖ పలు అభివృద్ధి పనులను చేపట్టింది. ఆయా కార్యక్రమాలను ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు రాష్ట్రపతి శ్రీశైలానికి చేరుకుంటారని పర్యాటక శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. ఆమె మధ్యాహ్నం 12.15 నుంచి 12.45 గంటల మధ్య టెంపుల్ టౌన్‌లో గడుపుతారు. ఇందులో పలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం, అధిష్టాన దేవతల దర్శనాలు ఉన్నాయి.
కాగా, ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం ఈ నెలలో రెండో సారి. రాష్ట్రపతి ఈ నెల 5న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలిసారిగా శ్రీవారి దర్శనార్థం ఆదివారం (డిసెంబర్ 5) తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ద్రౌపది ముర్ము తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
ఆ తర్వాతి రోజు (డిసెంబర్ 6 - సోమవారం) ఉదయం అతిథిగృహం నుంచి బయలుదేరిన ద్రౌపది ముర్ము.. తొలుత వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. రాష్ట్రపతికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. టీడీపీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు.. 2023 సంవత్సరం డైరీ, క్యాలెండర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు.
ముర్ము ఆంధ్రప్రదేశ్ లో తన రెండు రోజుల పర్యటనను ముగించుకునే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ భారతంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో అక్కడికి వెళ్లి అనుభూతిని పొందాలని సూచించారు. "గ్రామాలకు వెళ్లి అక్కడ రెండు మూడు రోజులు గడపండి. ప్రజలు ఎలా జీవిస్తున్నారో.. పిల్లలు, పురుషులు, మహిళలతో ఎలా సంభాషిస్తారో అనుభూతి పొందండి. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు వారికి చేరుతున్నాయో లేదో తెలుసుకోండి" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తన పర్యటన ముగింపు సందర్భంగా ఆమె శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు, అక్కడి అధ్యాపకులతో సంభాషించారు. ఈ క్రమంలోనే పై వ్యాఖ్యలు చేశారు. దేశం అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో పేరు తెచ్చుకుంటుందని ద్రౌపది ముర్ము అన్నారు. 'మహిళల కోసం ప్రధాని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. జనాభాలో సగం మంది (51 శాతం) మహిళలు ఉన్నారు. మహిళలకు మంచి జరగడం చాలా సంతోషంగా ఉంది' అని ఆమె వ్యాఖ్యానించారు.