నా భర్తపై దాడి వెనక రాజకీయ కోణం.. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి భార్య సంధ్య

By Sumanth KanukulaFirst Published Nov 27, 2022, 3:02 PM IST
Highlights

తెలుగు దేశం పార్టీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఆయన భార్య సంధ్య స్పందించారు. ఇది రాజకీయ కోణంలో జరిగిన దాడి అని ఆరోపించారు.

తెలుగు దేశం పార్టీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఆయన భార్య సంధ్య స్పందించారు. ఇది రాజకీయ కోణంలో జరిగిన దాడి అని ఆరోపించారు. 30 ఏళ్ల నుంచి కార్యకర్తల కోసం, పార్టీ కోసం కష్టపడుతున్న శ్రీనివాసులు రెడ్డి ఏరోజు కూడా వెనకడుగు వేయలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మూడున్నరేళ్లుగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. వాటికి ఏనాడూ శ్రీనివాసులు రెడ్డి భయపడలేదని అన్నారు. రాజకీయాల్లో ఇటువంటి కూడా జరుగుతాయా అనేది ఈ ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నామని చెప్పారు. ఇటువంటి దాడులకు శ్రీనివాసులు రెడ్డి భయపడరని.. రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తారని తెలిపారు. 


వెనక బలమైన సపోర్ట్ లేకుండా.. ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఇలా చేయడని అన్నారు. అతడి బ్యాగ్రౌండ్‌లో ఎవరూ లేకపోతే.. ఘటన జరిగిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి మర్డర్ చేయాలని చూస్తున్నారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ శ్రీనివాసులు రెడ్డి కిందపడి రక్తం కారుతుంటే ఎక్కడైనా మర్డర్ చేయడం జరుగుతుందా అని ప్రశ్నించారు. కొద్దిగా ఆలస్యమైనా నిజాలు అందరికి తెలుస్తాయని అన్నారు. పోలీసులు ఎంతవరకు విచారణ చేస్తారో తెలియదని.. తాము మాత్రం తమ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది త్వరలోనే బయటపెడతామని తెలిపారు. 

ఇక, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఆయన ఇంటి ప్రాంగణంలోనే కారు ఢీకొట్టింది. కారులో ఉన్న వ్యక్తిని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి స్నేహితులు రాజశేఖర్ రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనకు ముందు అక్కడ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. టీడీపీ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం.. కోటంరెడ్డి కుమారుడు ప్రజయ్‌ సేనారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. వారి మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజశేఖర్‌ రెడ్డి మద్యం మత్తులో కోటంరెడ్డి ఇంటికొచ్చాడు. అక్కడ ప్రజయ్‌సేనా రెడ్డితో గొడవకు దిగాడు. ఇంట్లోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారిద్దరినీ కోటంరెడ్డి వారించారు. ఇంటికి వచ్చి గొడవ చేయడమేమిటని ప్రశ్నించారు. కోటంరెడ్డి, ప్రజయ్‌, మరోవ్యక్తి కలిసి రాజశేఖర్‌రెడ్డిని ఇంటి నుంచి బయటికి పంపించారు. తర్వాత శ్రీనివాసులు రెడ్డి ఇంట్లోకి వస్తున్న సమయంలోనే..  రాజశేఖర్‌ రెడ్డి కారులో కూర్చుని రివర్స్‌ తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్టుగా కనిపించాడు. అయితే ఒక్కసారిగా కారును ముందుకు రానిచ్చి.. శ్రీనివాసులు రెడ్డిని ఢీకొట్టాడు. 

దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఫోన్ ద్వారా కోటంరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.  

click me!