జగన్ ను కలిసి తర్వాత మెలిక పెట్టి టీడీపిలోకి... ఎటూ కాకుండా పోయిన కొణతాల

By Nagaraju penumalaFirst Published Jun 4, 2019, 3:01 PM IST
Highlights

దురదృష్టం ఏంటంటే తటస్థుగా ఉన్నప్పుడు అటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చాలా గౌరవం ఇచ్చేవి. ఎప్పుడైతే టీడీపీ నేత అని ముద్ర పడిందో ఆనాటి నుంచి ఆయన వైపు కన్నెత్తి చూడటం మానేశారు.  

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రమంత్రిగా, ఎంపీగా పనిచేసి విశాఖ జిల్లాలో తన మార్కు రాజకీయాన్ని చూపించారు. గత ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలపై ఫోకస్ పెట్టారు. 

అమరావతి నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన ఆయన ఆకస్మాత్తుగా టీడీపీకి అనుబంధంగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట. 

ఇంతకీ ఆనేత ఎవరని అనుకుంటున్నారా ఇంకెవరు మాజీమంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ. నాలుగేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర వాసులకు మరింత దగ్గరయ్యారు కొణతాల రామకృష్ణ. 

దురదృష్టం ఏంటంటే తటస్థుగా ఉన్నప్పుడు అటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చాలా గౌరవం ఇచ్చేవి. ఎప్పుడైతే టీడీపీ నేత అని ముద్ర పడిందో ఆనాటి నుంచి ఆయన వైపు కన్నెత్తి చూడటం మానేశారు. 

దురదృష్టం ఏంటంటే ఆయన ప్రచారం చేసిన ఒక్క నియోజకవర్గంలోనూ టీడీపీ ఎమ్మెల్యే గెలవలేదు సరికదా ఆ పార్టీ అధికారానికే దూరమైంది. దీంతో కొణతాల రామకృష్ణ పరిస్థితి దయనీయంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కొణతాల రాకకోసం వేయికళ్లతో ఎదురుచూశాయి. 

అంతేకాదు జనసేన పార్టీ కూడా ఆశగా ఆయన రాకకోసం ఎదురుచూసింది. ఉత్తరాంధ్ర చర్చావేదిక పేరుతో రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టడంతో ఆయనను పార్టీలోకి తీసుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన పార్టీలు ప్రయత్నించాయి. 

తెలుగుదేశం పార్టీలో చేరాలని చంద్రబాబు నాయుడు ఆహ్వానించడంతో అమరావతి వెళ్లి చంద్రబాబు నాయుడును కలిశారు. పార్టీలో చేరతానంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆహ్వానం రావడంతో రాత్రికి రాత్రి విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. జగన్ ను కలిశారు. 

జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేద్దామనుకునేలోపు కొత్త మెలిక పెట్టారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని ఆ తర్వాతే పార్టీలో చేరతానని చెప్పుకొచ్చారు. అందుకు జగన్ ససేమిరా అనడంతో వెనక్కి వచ్చేశారు. 

టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి మళ్లీ టీడీపీవైపు చూసేసరికి టీడీపీలో సీట్ల పంపకాలు, సర్ధుబాట్లు అన్నీ జరిగిపోయాయి. కొణతాలకు ఇచ్చేందుకు ఏమీ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దాంతో కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరిస్తానని హామీ ఇచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

తీరా ఎన్నికల ఫలితాలు చూసేసరికి బొక్క బోర్లాపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలవ్వడమే కాదు ఆయన ప్రచారం చేసిన ఒక్క నియోజకవర్గంలో ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు. 

కొణతాల రామకృష్ణ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇలాంటి అనిశ్చితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొణతాల రామకృష్ణ టీడీపీకి అనుబంధంగానే ఉంటారా లేక ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున ఉద్యమాలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. 

అయితే రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే జోన్ పై ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు కొణతాల. దీంతో కొణతాల రామకృష్ణ ఉద్యమబాటనే పడతారని రాజకీయాలకు మళ్లీ దూరంగానే ఉంటారంటూ ప్రచారం జరుగుతుంది. 

click me!