
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు తాజా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంచలన కేసులో నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో గురువారం కేసు విచారణ జరుగుతుండగా లేఖ విషయం వెలుగులోకి వచ్చింది.
లేఖలో శ్రీను ఏం రాశారంటే.. ‘‘1610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉంటున్నా. నేను ఇంకా ఎంత కాలం జైలులో ఉంటానో తెలియడం లేదు. ఇకనైనా నాకు విముక్తి కలిగించండి. నాపై నమోదు అయిన కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలి. నాకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మీకు (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి) లేఖ రాస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
ఈ సందర్బంగా శ్రీను తరుఫు న్యాయవాది అబ్దుస్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు శ్రీను తెలుగులో రాసిన లేఖను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి.. సుప్రీం సీజేఐకి పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కోర్టు కు పది కిలో మీటర్ల దూరంలో సీఎం జగన్ నివాసం ఉంటుంది. కేవలం పదిహేను నిమిషాలు కేటాయించి.. సాక్ష్యం చెప్పి వెళ్లవచ్చు. కానీ, ఉద్దేశపూర్వకంగా ఆయన తన న్యాయవాదులతో పిటీషన్లు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ అధికారులు చెప్పినా కొత్తగా పిటిషన్ వేయడం వెనక వేరే కారణాలు ఉన్నాయని తెలిపారు.
విచారణను వేగవంతం చేసి త్వరితగతిన కేసుకు ముగింపు పలకాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
కోడికత్తి కేసులో అసలేం జరిగిందంటే ?
2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు వీఐపీ లాంజ్‌లో వేయిట్ చేశారు. ఈ సందర్బంగా ఓ వెయిటర్ సెల్ఫీ కావాలంటూ.. వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. ఆ వ్యక్తి వస్తూనే వైఎస్ జగన్‌పై కోళ్ల కత్తితో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. తొమ్మిది కుట్లేసినట్లుగా వెద్యులు ప్రకటించారు. మూడు వారాల వరకూ విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఘటనతో ఏపీ రాజకీయాలు పూర్తిగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద సంచలనంగా మారింది.