
టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించారు. అనంతరం భరత్‌ను జగన్ అభినందించి, భవిష్యత్తులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. జగన్ సీఎం అయ్యాక.. ఆంధ్రప్రదేశ్ నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ తానేనని చెప్పారు.
ఇందుకు చాలా గర్వంగా వుందని భరత్ అన్నారు. తన లాంటి క్రికెటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పూర్తిగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రోత్సాహం బాగుందని భరత్ ప్రశంసించారు. ఇలాంటి ప్రోత్సాహం వల్ల తన లాంటి క్రీడాకారులు మరింత మంది వెలుగులోకి వస్తారని ఆయన ఆకాంక్షించారు.