
పాత కేబినెట్‌లోని ఐదారుగురు మంత్రులు కొత్త మంత్రివర్గంలోనూ కొనసాగుతారని మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) చెప్పారు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటామని నాని పేర్కొన్నారు. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తామని సీఎం అన్నారని కొడాలి నాని తెలిపారు. అయితే ఎవరిని కొనసాగిస్తామనే వారి పేర్లను సీఎం చెప్పలేదని నాని స్పష్టం చేశారు. కొత్త కేబినెట్‌లో నేను వుంటే అవకాశాలు తక్కువని ఆయన పేర్కొన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలతో ఆ ఐదుగురు మంత్రులు ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
అంతకుముందు కేబినెట్ సమావేశంలో జగన్ (ys jagan) సరదాగా మాట్లాడారు. వెయ్యి రోజులు తన కేబినెట్‌లో వున్నారని... ఇక పార్టీ కోసం మీ సేవలు వినియోగించుకుంటానని చెప్పారు. చంద్రబాబును (chandrababu naidu) మరోసారి ఓడించే బాధ్యత మీదేనని సీఎం పేర్కొన్నారు. కేబినెట్ మీటింగ్ ప్రారంభానికి ముందుకు ఖాళీ లెటర్ హెడ్లపై రాజీనామా లేఖలు తయారు చేశారు ప్రోటోకాల్ అధికారులు. చివరిలో రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు మంత్రులు. 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్ కోరారు.
ముందుగా అనుకున్న విధంగానే ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్‌కు రాజీనామా లేఖలు సమర్పించారు. అనంతరం మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. తామంతా రాజీనామాలు చేశామని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రాజీనామా లేఖలు సీఎం అందజేశామని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్లే రాజీనామా చేసినట్లు వెల్లంపల్లి పేర్కొన్నారు. మాజీలు అయినవారిని పార్టీ కోసం పనిచేయమని జగన్ సూచించినట్లు అవంతి తెలిపారు. మంత్రి వర్గంలో ఎవరుంటారన్నది చెప్పలేదని శ్రీనివాస్ అన్నారు.