టీడీపీ హయాంలో వివేకా హత్య.. అప్పుడెందుకు మాట్లాడలేదు: పవన్‌‌కు కొడాలి నాని కౌంటర్

By Siva KodatiFirst Published Apr 4, 2021, 3:41 PM IST
Highlights

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగితే, స్పందించని పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు మంత్రి కొడాలి నాని

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగితే, స్పందించని పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు మంత్రి కొడాలి నాని. ఆదివారం నందివాడ మండల టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి దాసరి మేరీ విజయ కుమారి మంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు.

జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పార్టీకి రాజీనామా చేసిన మేరి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు కొడాలి నాని.

టీడీపీ హయాంలోనే వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైందని గుర్తుచేశారు. విచారణలో జగన్ అతనికి, సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉంటే అప్పుడే కేసు నమోదు చేసేవారని కొడాలి నాని స్పష్టం చేశారు.

తన తండ్రి హత్య కేసు విచారణపై వివేకా కుమార్తె , ఢిల్లీలో సీబీఐని ప్రశ్నిస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటని ఆయన నిలదీశారు. వివేకా హత్య కేసులో సీబీఐ చేసే విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కొడాలి నాని స్పష్టం చేశారు.

రాజకీయాలను కూడా వ్యాపారంగా మార్చేసిన పవన్ కళ్యాణ్, ఎవరో రాసిచ్చిన డైలాగులు, స్క్రిప్టులు చదువుతున్నాడని సెటైర్లు వేశారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని నాని జోస్యం చెప్పారు.

దేవుళ్ల గుళ్ళపై అమిత ప్రేమ ఉందన్న బిజెపి, అంతర్వేది రథ దగ్ధం కేసులో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినా కేంద్రం స్పందించలేదని కొడాలి నాని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేసిన కేసుల్లో అనేక మందిని అరెస్టులు చేశారని.. మత విద్వేషాల ద్వారా లబ్ధి పొందేందుకు రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేనలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమని కేంద్రానికి ధైర్యం ఉంటే గుళ్ళ పై జరిగిన దాడులపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నాని సవాల్ విసిరారు. 

click me!