
గుడివాడ: వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని.. ఆయన పర్మనెంట్‌గా ఆ సీటులో ఉంటారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను ఆ సీటు నుంచి దింపే మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదని అన్నారు. సీఎం జగన్ దయతో గుడివాడ ఎమ్మెల్యేగా తానే ఉంటానని అన్నారు. ఈ టర్మ్‌లో గుడివాడ అభివృద్ధి పనులకు రూ. 1500 కోట్లు ఇచ్చారని.. వచ్చే ఐదేళ్లలో రూ. 750 కోట్లు ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరారు. 2029లో తాము ఇంకా ఏం అడగమని చెప్పారు.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలో టిడ్కో ఇళ్లను సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఇందుకోసం సీఎం జగన్ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు ఆయనకు పూలవర్షంతో స్వాగతం పలికారు. అక్కడ పలు టిడ్కో ఇళ్లను పరిశీలించిన జగన్.. పలువురు మహిళలకు పసుపు, కుంకుమ, చీరతోపాటు ఇంటి పట్టాను అందజేశారు. అనంతరం టిడ్కో గృహాల ప్రాంగణంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. లబ్ధిదారులతో కలిసి ఫొటోలు దిగారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. గుడివాడ ప్రజల 20 ఏళ్ల కల నెరవేర్చడానికి వచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం దివంగత వైఎస్సార్ చలువేనని అన్నారు. 45 రోజుల్లో 77 ఎకరాలను మంజూరు చేశారని తెలిపారు. గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం జరిగిందంటే అది రాజశేఖరరెడ్డి ఇచ్చిన భిక్షగా తాను భావిస్తున్నానని చెప్పారు. అందుకే ఇక్కడ రాజశేఖరరెడ్డి 18 అడుగుల విగ్రహం పెట్టి ఆయన రుణం తీర్చుకుంటున్నానని తెలిపారు. ఈరోజు ఎటువంటి వంక లేకుండా ఈ ఇళ్లను సీఎం జగన్ పేదలకు అందజేస్తున్నారని చెప్పారు.
‘‘అప్పట్లో తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా.. సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి గుడివాడ పర్యటనకు వస్తే దేవినేని ఉమా నాకు ఫోన్ చేసి నన్ను విజయవాడకు రమ్మని చెప్పాడు. అయితే నేను మాత్రం సీఎం నా నియోజకవర్గానికి వస్తున్నారు.. నేను వెళ్తానని చెప్పాను. వెంటనే 10 నిమిషాల్లో చంద్రబాబు ఫోన్ చేశాడు. మనం అధికారంలోకి వస్తాం.. గుడివాడలో నీకు ఎది కావాలంటే అది చేస్తాను.. నువ్వు అక్కడికి వెళ్లకు అని నాతో చెప్పాడు. చంద్రబాబు మాటలు చాలా కాలంగా వింటున్నానని చెప్పి.. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ వద్దకు వెళ్లాను. రిప్రజంటేషన్ ఇద్దామని వెళితే.. ఆయన నన్ను బస్సు ఎక్కమని చెప్పాడు. బస్సు ఎక్కిన తర్వాత పక్కన కూర్చొబెట్టుకుని నియోజకవర్గ సమస్య విన్నారు’’ అని కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ ప్రజల దాహార్తిని వైఎస్సార్ తీర్చారని చెప్పారు. అప్పుడు చంద్రబాబు మాట వింటే చరిత్ర హీనుడిని అయ్యేవాడినని అన్నారు.
గుడివాడకు వచ్చి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతాడని విమర్శించారు. ఎన్టీఆర్ సొంత గ్రామానికి చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలని సవాలు విసిరారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైన కూడా విమర్శలు గుప్పించారు. ఎలాంటి పార్టీ లేకుండా హీరోయిన్లు నవనీత్ కౌర్, సుమలతలు స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారని అన్నారు. ప్యాకేజ్ స్టార్ అనిపించుకుంటున్న పవన్ కల్యాణ్ మాత్రం.. పార్టీ పెట్టి పదేళ్లయినా ఇంకా అసెంబ్లీలో అడుగు పెడతా అని చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నాడని ఆరోపించారు.