నిన్నూ బాలయ్యను మాత్రమే గెలిపించారు: చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

By telugu teamFirst Published Aug 1, 2020, 12:31 PM IST
Highlights

రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన సవాల్ చేశారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ చేసారు. 

టీడీపీ 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరమపై పునరాలోచన చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఒక వేళ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తీసుకున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయాలకు విసుగు చెందిన ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారని ఆయన వ్యాఖ్యనించారు. 

రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబును, బాలకృష్ణను మాత్రమే గెలిపించారని, అక్కడి ప్రజలు చీదరించుకున్నా చంద్రబాబుకు బుద్ది రాలేదని ఆయన అన్నారు. టీడీపీకి కంచుకోట అయిన ఉత్తరాంధ్ర ప్రాంతమని, అక్కడి ప్రజలు కూడా చంద్రబాబుకు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. కృష్ణా, గుంటూరు ప్రజలకు కూడా చంద్రబాబు చేసిన మోసాలను గ్రహించి లోకేష్ ను ఓడించారని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల కోరిక మేరకు తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, లేకపోతే మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమాలు వస్తాయనే ఆలోచనతోనే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకే చోట లక్ష కోట్ల వ్యయంతో మహా నగరం నిర్మించడం సాధ్యం కాదని కొడాలి నాని అన్నారు. అమరావతి రాజధాని నిర్మించడానికి అయ్యే ఖర్చులో పది శాతం విశాఖపట్నంలో పెడితే మనం కూడా మహా నగరాలకు ధీటుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతామని ఆయన అన్నారు.

click me!