కాంగ్రెసుకు మరో షాక్: జగన్ పార్టీలోకి కిల్లి కృపారాణి

By Nagaraju TFirst Published Jan 24, 2019, 4:49 PM IST
Highlights

 వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడంతోపాటు వైసీపీకి మైలేజ్ వచ్చింది. ఇచ్ఛాపురం బహిరంగ సభ శ్రీకాకుళం జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్ కిందకు చేరిపోవాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె వైసీపీలో చేరికపై వైఎస్ జగన్ తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 

శ్రీకాకుళం: ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు ఆ పార్టీ సీనియర్ల వెన్నులో వణుకు పుట్టిస్తోందా..?ఏపీలో ఉనికి లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుతో అడ్రస్ గల్లంతవుతుందని భయపడుతున్నారా..?కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని సీనియర్లు పక్కచూపులు చూస్తున్నారా..?

తమ రాజకీయభవిష్యత్ కోసం భవిష్యత్ ఉన్న పార్టీల వైపు కన్నేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఉద్దండులు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో ఒక పార్టీలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే కనీసం రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టగలుగుతుందని ఆశించిన వారికి పొత్తు లేదని తేలడంతో వారంతా ఇప్పుడు గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు. 

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాల వల్ల కర్నూలు  జిల్లాకు చెందిన కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అదే బాటలో పయనించేందుకు రెడీ అవుతున్నారు మరో కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి. 

ఒక్కొక్కరు పార్టీ వీడుతుండటంతో ఇక ఆమె కూడా తన దారి తను చూసుకున్నారు. గత కొంతకాలంగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు ప్రచారం జరుగుతుంది.  మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరినప్పుడే ఆమె కూడా చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె చేరకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. 

 వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడంతోపాటు వైసీపీకి మైలేజ్ వచ్చింది. ఇచ్ఛాపురం బహిరంగ సభ శ్రీకాకుళం జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్ కిందకు చేరిపోవాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె వైసీపీలో చేరికపై వైఎస్ జగన్ తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 

 ఇకపోతే ఏపీ రాజకీయాల్లో జెయింట్ కిల్లర్ గా కిల్లి కృపారాణికి పేరుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడుని ఓడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చరిత్ర సృష్టించింది. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ ఉత్తరాంధ్ర రాజకీయాలను ఒంటి చేత్తో ఏలిన ఎర్రన్నాయుడుని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించింది. 

అంతే ఆనాటి నుంచి ఆమెను జెయింట్ కిల్లర్ గా పిలుస్తారు. ఎర్రన్నాయుడుని ఓడించారన్న కారణంగా ఆమె మన్మోహన్ సింగ్ కేబినేట్లో మంత్రి పదవిని సైతం కొట్టేశారు. కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. 

అయితే రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ జెయింట్ కిల్లర్ కాస్త బొక్క బోర్లా పడ్డారు. విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓటమి చెందారు. ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు చేతిలో డిపాజిట్ కోల్పోయారు. 

రాష్ట్ర విభజన అనంతరం ఒక్కొక్కరు పార్టీ మారుతున్నా కిల్లి కృపారాణి మాత్రం పార్టీ వీడలేదు. గతంలో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కోలుకోవడం కష్టమని తేల్చి చెప్పారు. 

రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీ వీడాలని నిర్ణయించుకున్నా టీడీపీతో పొత్తు ఉంటుందని లీకులు రావడంత మిన్నకుండిపోయారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోనూ ప్రజాకూటమి అభ్యర్థుల తరుపున ప్రచారం కూడా నిర్వహించారు కిల్లి కృపారాణి.  

అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వికటించినా ఏపీలో సక్సెస్ అవుతుందని ఆమె ఆశించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లు అయినా దక్కుతాయని అధికార పార్టీ తోడవ్వడంతో రాజకీయం తిప్పొచ్చని ఆశించారు. 

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పొత్తు లేదని తేల్చి చెప్పేసింది. దీంతో ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కార్యకర్తలతో సమావేశమై వైసీపీలో చేరే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.  

ఇప్పటికే వైఎస్ జగన్ పలువురి తటస్థులకు అన్న పిలుపు పేరుతో లేఖలు రాశారు. పార్టీకి సూచనలు సలహాలు ఇవ్వాలని కూడా కోరారు. పార్టీలో చేరే ఆసక్తి ఉంటే నేరుగా కలవాలని కూడా జనగ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కండువాకప్పుకుంటే బాగుంటుందని కొంతమంది సన్నిహితులు ఆమెకు సూచిస్తున్నారట.

ఇకపోతే గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపినప్పుడు జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆమె చెప్పుకొస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అవకాశం ఇవ్వాలని కోరగా అక్కడ వైసీపీ నుంచే పోటీ ఉందని జగన్ చెప్పారని వేరే స్థానం చూసుకోవాలని చెప్పారట. 

అయితే కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమె తన సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న పలాస టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఆ సీటుపై కూడా జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదట. ముందు పార్టీలో చేరాలని టిక్కెట్ విషయం తర్వాత చూస్తామని అయితే పార్టీ పరంగా మంచి గుర్తింపు మాత్రం ఇస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. 

జగన్ కనుక స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమె కాంగ్రెస్ లో నే ఉండిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తలు అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించి కార్యకర్తల అభిప్రాయం మేరకు వైఎస్ జగన్ ను కలిసే ఆలోచనలో ఉన్నట్లు  ప్రచారం జరుగుతోంది.   

click me!