
డోన్ : ఆంధ్రప్రదేశ్లోని డోన్ లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆస్తికోసం తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయడం చూశాం. వృద్ధాప్యంలో వారి ఆస్తులు లాక్కుని అనాధలుగా వదిలేసిన సంఘటనలు జరిగాయి. కానీ, డోన్ లో జరిగిన ఈ ఘటన పూర్తిగా భిన్నమైనది. ఓ తండ్రి ఆస్తికోసం కొడుకును, కోడలిని… వారి కూతురిని కిడ్నాప్ చేసి ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..
నిరంజన్ అనే వ్యక్తి డోన్ నివాసి. అతనికి వినోద్ అనే కొడుకు ఉన్నాడు. వీరిమధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. వినోద్ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి ఇష్టం లేని తండ్రి కొడుకు పేరు మీద ఉన్న ఆస్తి అంతా తిరిగి ఇచ్చేయాలని వేధింపులు మొదలుపెట్టాడు. దీనికి కొడుకు ఒప్పుకోలేదు. మామూలుగా చెబితే కొడుకు ఇవ్వడం లేదని.. కొడుకు నుంచి ఆస్తిని రాబట్టుకోవడానికి ఓ సుపారీ గ్యాంగ్ ను మాట్లాడాడు. కొడుకును కిడ్నాప్ చేయాలని వారి కోసం రెండు ఇన్నోవా కార్లు కూడా ఏర్పాటు చేశాడు.
తండ్రి ఆలోచన ప్రకారం కొడుకు, కోడలు, వారి కూతుర్ని కిడ్నాప్ చేసిన ఆ గ్యాంగ్.. ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమని వారిని చిత్రహింసలకు గురి చేశారు. అప్పటికి కూడా వినోద్ సంతకాలు పెట్టకపోవడంతో మరింత క్రూరత్వాన్ని చూపించారు. వినోద్ కూతురు మెడమీద కత్తినిపెట్టి.. సినిమాటిక్ గా ఆస్తి కాగితాల మీద సంతకం పెడతావా.. లేదంటే చిన్నారిని చంపమంటావా అంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన వినోద్.. ఆస్తిపత్రాలపై సంతకాలు చేశాడు. ఆ తర్వాత వారిని వదిలేశారు.
విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. కానీ, కిడ్నాపర్ల చెరనుంచి బయటికి వచ్చిన తర్వాత వినోద్ పోలీసులను ఆశ్రయించాడు. తండ్రి దాస్టికాన్ని చెప్పుకొచ్చాడు.. కిడ్నాపర్ల వేధింపుల మీద ఫిర్యాదు చేశాడు. అయితే, వినోద్ ఫిర్యాదును డోన్ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో విషయాన్ని నంద్యాల ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్ లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఈ కిడ్నాప్, బ్లాక్మెయిల్, హత్యాయత్నానికి సూత్రధారి అయిన వినోద్ తండ్రి నిరంజన్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఇంతటితో అయిపోలేదని తనకు తండ్రితో.. సుపారీ గ్యాంగ్ తో ప్రాణహాని ఉందని వినోద్ చెబుతున్నాడు. తన కూతురు చిన్న పాప అయినా ఆమెను కూడా చంపడానికి వెనకాడరని భయాందోళనలు వ్యక్తం చేశాడు.