
అతడు ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తున్నాడు. శుక్రవారం నాడు ఎప్పటిలాగే తన ఉద్యోగానికి వెళ్లాడు. అయితే ఓ ఐదుగురు వ్యక్తులు వచ్చి అతడిని బలవంతగా షాప్ లాక్కెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. కానీ మరసటి రోజు అతడు శవమై కనిపించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులో తీవ్ర కలకలం సృష్టించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలోని కల్యాణ్ జ్యువెలరీ షాప్ లో రామాంజనేయులు అనే వ్యక్తి సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. అయితే అతడు పని చేసే షాప్ కు శుక్రవారం ఓ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. రామాంజనేయులను బలవంతంగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఓ ఆటోలో ఎక్కడికో తీసుకెళ్లారు.
ఈ విషయ తెలియడంతో రామాంజనేయులు భార్య ప్రసన్నలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా కిడ్నాప్ కు గురైన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో రామాంజనేయులును ఓ ఐదుగురు వ్యక్తులు లాక్కెళ్తున్నట్టు గమనించారు.
కాగా శనివారం నాడు పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద రామాంజనేయులు హత్యకు గురై కనిపించాడు. అతడిని ఎవరో దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ గోనె సంచిలో ఉంచి, దానిని హైవే కింద ఉన్న ఓ బ్రిడ్జి కింద ఉంచారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఘటనాస్థలి వద్ద క్లూస్ టీం వివరాలు సేకరించింది. అయితే తర భర్తను బాజీ, మరి కొంత మంది వ్యక్తులు కిడ్నాప్ చేశారని భార్య ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా రామాంజనేయులను కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన ఆటోను పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యకు కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.