కియా మోటార్స్ ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన వార్తాకథనం సంచలనం సృష్టిస్తోంది. దానిపై ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టత ఇచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన వార్తాకథనం సంచలనం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ ప్లాంటును పక్క రాష్ట్రానికి తరలించడానికి కియా మోటార్స్ యాజమాన్యం చర్చలు జరుపుతోందంటూ ఓ వార్తాకథనం ప్రచురితమైంది. ఈ ప్లాంట్ తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందని ఆ వార్తాకథనం సారాంశం.
అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ తన ప్లాంట్ ను రిలోకేట్ చేసుకునే ఆలోచనలో ఉందని, ఇందుకు సంబంధించి వచ్చే వారం కార్యదర్శుల స్థాయలో చర్చలు జరుగుతాయని, ఆ తర్వాత ప్లాంట్ తరలింపుపై మరింత స్పష్టత వస్తుందని రాయిటర్స్ వార్తాకథనం వివరించింది.
undefined
ఏపీలో సంస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంందని, అందుకే ప్లాంట్ ను తరలించాలని భావిస్తున్నారని తమిళనాడుకు చెందిన ఓ ముఖ్యమైన అధికారి చెప్పినట్లు కూడా ఆ పత్రిక రాసింది. ఇందుకుగాను కియా అనుబంధ సంస్థ హుందాయ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హుందాయ్ కి తమిళనాడులో భారీ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉంది.
అందు వల్ల వారి ద్వారా తమిళనాడు ప్రభుత్వాన్ని కియా సంప్రదించిందని రాయిటర్స్ రాసింది. దీనిపై తమిళనాడు, ఎపీ సీఎంవోలు స్పందించడానికి నిరాకరించినట్లు తెలిపింది. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే జగన్ ప్రభుత్వ నిబంధన ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఇది ఒక కారణం కాగా, గత చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన రాయితీలను, ప్రోత్సహకాలను కూడా జగన్ ప్రభుత్వం సమీక్షించాలని నిర్ణయించడం మరో కారణమని చెబుతున్నారు.
తమిళనాడుకు ప్లాంట్ ను తరలిస్తే లాజిస్టిక్ వ్యయాలు కూడా తగ్గుతాయని కియా భావిస్తున్నట్లు రాయిటర్స్ రాసింది. ప్లాంట్ తరలింపుపై ఇప్పటికిప్పుడు స్పష్టత రాలేదని, అయితే త్వరలోనే ఆ విషయం వెల్లడవుతుందని రాయిటర్స్ అంటోంది. ప్లాంట్ తరలింపు చర్చలు అత్యంత రహస్యంగా జరుగుతున్నాయంటూ పేర్లు చెప్పడానికి ఇష్టపడని విశ్వసనీయ వర్గాలు అంటున్నట్లు తెలిపింది.
అయితే, ప్లాంట్ ను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం అంత సులువైన విషయం కాదని అంటున్నారు. నిరుడు డిసెంబర్ లో అనంతపురం పెనుకొండలో కియా మోటార్స్ ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి.
అయితే, రాయిటర్స్ వార్తాకథనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండిస్తోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పషథ్టం చేసింది. రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వం తప్పు పట్టింది. ఈ విషయంపై ఏపీ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టత ఇచ్చారు. కియా, ప్రభుత్వం కలిసే పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. రాయిటర్స్ కథనంలో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు.