టీడీపీకి షాక్: వైసీపీ గూటికి మాజీమంత్రి..?

By Nagaraju penumalaFirst Published Feb 4, 2019, 3:16 PM IST
Highlights

అయితే అధినేత నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆయన గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్నారు. ఆయన అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికింది. అంతేకాదు పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని కూడా ఎరవేసినట్లు తెలుస్తోంది.  


కడప: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో చేరికలపై దృష్టి సారించాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. ఇప్పటికే వైసీపీ వీడిన, వైసీపీలో అసంతృప్తులను టార్గెట్ గా చేసుకుని టీడీపీ పావులు కదుపుతుంది. అసంతృప్తులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. 

అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పార్టీలో చేరికలపై దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతుండటంతో మాంచి జోష్ మీద ఉన్న వైసీపీ మరింత మందిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 

ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తటస్థులను టార్గెట్ చేస్తూ పార్టీలో చేరాలంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల సమన్వయ కర్తలు గత కొంతకాలంగా తటస్థంగా ఉన్న నేతలపై ఫోకస్ పెట్టారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలుకుతున్నారు. 

తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత ఖలీల్‌బాషను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌బాష, మేయర్‌ సురేష్‌బాబు ఆదివారం సాయంత్రం ఖలీల్ బాషాను ఆయన స్వగృహంలో కలిశారు. 

పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అయితే కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం ప్రకటిస్తానని ఖలీల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఖలీల్‌బాష గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేశారు. 

అనంతరం 2009 టీడీపీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించారు. 

అయితే అధినేత నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆయన గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్నారు. ఆయన అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికింది. అంతేకాదు పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని కూడా ఎరవేసినట్లు తెలుస్తోంది.  

click me!