
రాష్ట్రంలోని ప్రైవేటు ట్రావెల్స్ లోగట్టు బయటపడుతోంది. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలంతా అక్రమ వ్యాపారులేనని విజయవాడ ఎంపి నాని ఇంతకాలం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే కదా? అయితే, తాను మాత్రం నిప్పేనంటూ చెప్పుకుంటున్న కేశినేని ట్రావెల్స్ అధినేత, విజయవాడ ఎంపి కేశినేని నాని బండారాన్ని మిగిలిన ట్రావెల్స్ వాళ్ళు ఈరోజు బయటపెట్టారు. దాంతో నాని ఖంగుతిన్నారు. మీడియా సమావేశంలో ఇంతకాలం నాని చేసిన అక్రమాల జాబితాను మిగిలిన వెల్లడించారు. ఈరోజు వీళ్ళు చేసిన ఆరోపణతో నాని నీతిమంతుడు కాదని తేలిపోయింది.
ఆరెంజ్, మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాట్లాడుతూ నాని అక్రమంగా తిప్పిన బస్సుల జాబితాను విడుదల చేసారు. దాంతో ఇంతకాలం ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై నాని చేస్తున్న ఆరోపణలు కీలక మలుపు తిరిగాయి. నిబంధనలకు విరుద్దంగా ఇంత కాలం నాని తిప్పిన (ఓవర్ హ్యాంగ్) 27 బస్సుల జాబితాను బయటపెట్టారు. అక్రమ బస్సులను నడపడంలో కేశినేనినానీ దిట్ట అనిచెప్పారు. ఏపీలో రిజిస్ట్రయిన బస్సులు కూడా నిబంధనలకు విరుద్ధంగానే నడిచాయంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.