కేశినేని శ్వేత రాయబారం: చల్లారిన బెజవాడ టీడీపీ నేతల మధ్య చిచ్చు

By telugu team  |  First Published Mar 6, 2021, 5:46 PM IST

విజయవాడ కార్పోరేషన్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని కూతురు రంగంలోకి దిగినత తర్వాత బెజవాడ టీడీపీ నేతల మధ్య నెలకొన్న విబేదాలు సద్దుమణిగాయి. బొండా ఉమా, బుద్దా వెంకన్న దిగివచ్చారు.


విజయవాడ: విజయవాడ కార్పోరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత రంగంలోకి దిగడంతో టీడీపీ నేతల మధ్య నెలకొన్న తీవ్రమైన విభేదాలు సద్దుమణిగాయి. గంటల వ్యవధిలోనే విభేదాలు ఓ కొలిక్కి వచ్చాయి. శ్వేత తండ్రి, విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేశినేని పాల్గొంటే చంద్రబాబు విజయవాడ పర్యటనలో తాము ఉండబోమని ధిక్కార స్వరం వినిపించారు. 

ముగ్గురు నాయకుల తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనతో ఆయన ముగ్గురు నాయుకులతోనూ మాట్లాడారు. ఆ తర్వాత శ్వేత రంగంలోకి దిగారు. ఆమె బొండా ఉమా ఇంటికి వెళ్లి మాట్లాడారు. బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో చర్చించారు. తనకు మద్దతు ఇవ్వాలని, తన విజయానికి సహకరించాలని ఆమె వారిని కోరారు.

Latest Videos

undefined

శ్వేత రాయబారంతో ముగ్గురు నేతలు కూడా దిగి వచ్చారు తాము శ్వేత విజయానికి కృషి చేస్తామని ఆ తర్వాత వారు మీడియాతో చెప్పారు. అంతేకాకుండా విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తామని చెప్పారు. దీంతో గుప్పుమన్న చిచ్చు ఒక్కసారిగా చల్లారిపోయింది. 

ఇకపై లోపాలకు తావు లేకుండా చూసుకుంటామని బొండా ఉమా చెప్పారు. తాను మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. తాము శ్వేత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదని చెప్పారు. నిజానికి, ముగ్గురు నేతలు కూడా శ్వేత అభ్యర్థిత్వాన్ని మీడియా సమావేశంలో వ్యతిరేకించలేదు. తాము వ్యతిరేకించడం లేదని కూడా చెప్పారు. కేశినేని నాని లక్ష్యంగా చేసుకుని వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

వారి విమర్శలకు కేశినేని నాని స్పందించారు. వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. తాను ఏమీ మాట్లాడబోనంటూనే వారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను వారిపై ఫిర్యాదు చేయబోనని, అంతా చంద్రబాబు చూసుకుంటారని చెప్పారు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే అచ్చెన్నాయుడు రంగంలోకి దిగడం, శ్వేత బొండా ఉమా నివాసానికి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. దాంతో విభేదాలు సమసిపోయాయి.

click me!