గుంటూరు: వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిదో ?

Published : Mar 02, 2018, 08:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
గుంటూరు: వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిదో ?

సారాంశం

రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్ధానాల్లో గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్న స్ధానాల్లో గుంటూరు కూడా ఒకటి.

వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్ధానంలో రసవత్తరమైన పోటీ జరిగే  అవకాశం ఉంది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్ధానాల్లో గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్న స్ధానాల్లో గుంటూరు కూడా ఒకటి. టిడిపి నుండి సిట్టింగ్ ఎంపి గల్లా జయదేవే తిరిగి పోటీ చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇక వైసిపి నుండి లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీకి రంగం సిద్ధమైంది.

పోయిన ఎన్నికల్లో గల్లాకు సుమారు లక్ష ఓట్ల మెజారిటీ వచ్చింది. అప్పట్లోనే గల్లా గెలుపు కష్టమని ప్రచారం జరిగింది. అయితే, నరేంద్రమోడి హవా, పవన్ కల్యాణ్ మద్దతు టిడిపికి కలసి రావటంతో గల్లా గిలిచారు. దానికితోడు ఎటుతిరిగి తాను కూడా పెద్ద పారిశ్రామికవేత్తే కావటంతో నియోజకవర్గంలో పరిశ్రమ పెడతానని, పరిశ్రమలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దాన్ని ప్రజలు నమ్మారు. అంతేకాకుండా గల్లా జయదేవ్ సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా అల్లుడు కావటం కూడా సామాజికపరంగా కలసి వచ్చింది.

ఇక, మూడున్నరేళ్ళ తర్వాత గల్లా హామీలను చూస్తే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. దానికితోడు ఎంపి వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వినబడుతున్నాయి. అన్నింటికీ మించి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువైపోయింది. పోయిన ఎన్నికల్లో టిడిపికి అనుకూలమైన మోడి హవా, పవన్ మద్దతు వచ్చే సారి కలిసి వచ్చేది అనుమానమే.

అయితే, రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలోనే ఉంది. రాజధానిని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేయటమన్నది సామాజికవర్గ  పరంగా గల్లాకు  బాగా కలసివస్తుందన్నది ఓ అంచనా. ఎటుతిరిగి ఆర్ధికంగా బలమైన అభ్యర్ధే అనటంలో సందేహం లేదు.

ఇక, వైసిపి గురించి ఆలోచిస్తే విజ్ఞాన్ విద్యాసంస్ధల యజమానిగా ప్రముఖుడైన లావు రత్తయ్య మనవడు లావు శ్రీకృష్ణ దేవరాయులు పోటీ చేయటం దాదాపు ఖాయం. పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఆర్ధికంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా శ్రీకృష్ణ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కావటం కలిసివచ్చేదే.

గల్లాతో పోల్చితే వైసిపి అభ్యర్ధి స్ధానికుడు కావటం పెద్ద అడ్వాంటేజ్. నియోజకవర్గం పరిధిలో విద్యాసంస్ధలు ఉండటం ఏమన్నా కలసి వస్తుందేమో చూడాలి.  అభ్యర్ధి కొత్త కావటంతో ఆరోపణలు చేయటానికి ప్రత్యర్ధులకు అవకాశం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడయితే గెలుపు నల్లేరుమీద నడకే అని పార్టీ వర్గాలంటున్నాయ్. మొత్తం మీద వచ్చే ఎన్నకల్లో ఇద్దరి మధ్య పోటీ గట్టిగా ఉంటుందనటంలో ఎవరకీ సందేహం అవసరం లేదు.

 

 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Pawan Kalyan Visits Nanded Gurudwara: నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్| Asianet Telugu