కేసీఆర్ మిషన్ ఎపి: పవన్ కల్యాణ్ నో, చంద్రబాబు సాఫ్ట్

By pratap reddyFirst Published Jan 19, 2019, 1:09 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ మిషన్ ఎపిని ప్రారంభించారు. ఆ మిషన్ లో భాగంగానే పవన్ కల్యాణ్ కు, జగన్ కు మధ్య పొత్తు కుదిరించాలని ఆయన ప్రయత్నించినట్లు చెబుతారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తరఫున ఆయన తనయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పవన్ కల్యాణ్ తో రాయబారాలు నడిపినట్లు సమాచారం.

తనతో రాయబారాలు నడిపారని, తమకు బలం లేకపోతే పొత్తుకు రాయబారాలు ఎందుకు నడుపుతారని, ఇదే తమ బలానికి నిదర్శనమని పవన్ కల్యాణ్ అంటూ పవన్ కల్యాణ్ గుట్టు విప్పారు. వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్, పవన్ కల్యాణ్ కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించడం సులభమనేది సర్వత్రా వినిపించే మాట. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ మిషన్ ఎపిని ప్రారంభించారు. ఆ మిషన్ లో భాగంగానే పవన్ కల్యాణ్ కు, జగన్ కు మధ్య పొత్తు కుదిరించాలని ఆయన ప్రయత్నించినట్లు చెబుతారు. పవన్ కల్యాణ్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో కేసీఆర్ తన పంథాలో సాగుతున్నట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుల రాజకీయాలకు పెట్టింది పేరు. ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి పవన్ కల్యాణ్, కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు, రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు భావిస్తారు. ఈ తరుణంలో బీసీలను, ఇతర సామాజిక వర్గాలను చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ అనుకూలంగా మలిచే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, వెలమ సామాజిక వర్గానికి చెందిన మాధవరం కృష్ణా రావు ఆంధ్ర పర్యటనలు చేశారని అంటారు. మున్ముందు తమ వివిధ సామాజిక వర్గాలకు చెందిన తన పార్టీ నాయకులను కేసీఆర్ ఆంధ్రకు పంపించే అవకాశం ఉంది. 

జగన్ నేరుగా మద్దతు పలుకుతూ కేసీఆర్ వచ్చే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ను బలోపేతం చేయడానికి జగన్ ను గెలిపించాలనే సందేశమేదైనా ఆయన ఇవ్వవచ్చు. అదే సమయంలో చంద్రబాబును ఓడించాలని కూడా ఆయన చెప్పవచ్చు. అంతకు మించి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదని అంటున్నారు. 

కేసీఆర్ అడుగు పెడితే చంద్రబాబు సెంటిమెంటును ముందుకు తెస్తారనేది ఇప్పటికే తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్ ఎపికి ఎలా న్యాయం చేస్తారని ఇప్పటికే చంద్రబాబు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్ష జోక్యానికి కేసీఆర్ దూరంగా ఉండవచ్చునని అంటున్నారు. 

పవన్ కల్యాణ్ తో టీఆర్ఎస్ రాయబారాలు బెడిసికొట్టిన నేపథ్యంలో చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చారు. పవన్ కల్యాణ్ పట్ల మెతక వైఖరి తీసుకున్నారు. అవసరమైతే ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ తో దోస్తీ కట్టే ఆలోచన కూడా ఆయన మనసులో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసుతో నేరుగా పొత్తు ఉండదు కాబట్టి పవన్ కల్యాణ్ దోస్తీకి అంగీకరించవచ్చునని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ తో స్నేహం చేసే ఉద్దేశంతోనే కాంగ్రెసుతో పొత్తును చంద్రబాబు వద్దంటున్నారని సమాచారం.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపించేనాటికి ఆయన తన పంథాను మార్చుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

click me!