టీడీపీ తెగదెంపులు: ఐనా బీజేపీకి నారాయణ విరాళాలు

By sivanagaprasad kodatiFirst Published Jan 19, 2019, 12:46 PM IST
Highlights

ఏపీ మంత్రి నారాయణకు చెందిన నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ బీజేపీకి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఆర్ధిక సంవత్సరానికి గాను అందిన విరాళాలకు సంబంధించి దేశంలోని పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి తమ ఆదాయ వ్యయాలను సమర్పించాయి. 

ప్రస్తుతం బీజేపీ-టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి నెలకొన్న పరిస్థితి తెలిసిందే. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కూటమిని తెరపైకి తీసుకొస్తున్నారు.

దీనిపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేయడం, టీడీపీ ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మద్దతుదారుల ఇళ్లపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరగడంతో రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. ఒకరంటే ఒకరు మండిపడుతూ నోటికి పని చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో ఏపీ మంత్రి నారాయణకు చెందిన నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ బీజేపీకి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఆర్ధిక సంవత్సరానికి గాను అందిన విరాళాలకు సంబంధించి దేశంలోని పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి తమ ఆదాయ వ్యయాలను సమర్పించాయి.

వీటి ఆధారంగా బీజేపీ దేశంలోని అత్యంత ధనిక పార్టీగా అవతరించింది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలల్లో 93 శాతం బీజేపీకే అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ సంస్థ వెల్లడించింది.  

దీని ప్రకారం రూ.20 వేలకు మించి ఎక్కువ విరాళాలు అందుకున్న పొలిటికల్ పార్టీల్లో భారతీయ జనతా పార్టీ నెంబర్‌వన్‌గా అవతరించింది. గత ఆర్ధిక సంవత్సరంలో అన్ని పార్టీలకు కలిపి రూ. 469.89 కోట్లు విరాళాలు రాగా, అందులో ఒక్క బీజేపీకికే రూ.437. 04 కోట్లు దక్కాయి.

ఆ తర్వాత కాంగ్రెస్ రూ.26.25 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది.  మిగిలిన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీల విరాళాలతో పోలిస్తే... బీజేపీ అందుకున్న విరాళాల మొత్తం 12 రెట్లు అధికం.

విరాళాల సంఖ్య పరంగా మొత్తం 4201 విరాళాల్లో 2977 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. అదే సమయంలో కాంగ్రెస్‌కు కేవలం 777 విరాళాలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు 20 శాతం మేర తగ్గినట్లు గుర్తించారు.

విరాళాలు అందించిన వారిలో మెజారీటి విభాగం కార్పోరేట్ రంగమే. గతేడాది కార్పోరేట్ల నుంచి బీజేపీకి రూ.400.23 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.19.29 కోట్లు అందాయి. బీజేపీకి ఒక్క ఢిల్లీలోనే అత్యధికంగా రూ.208.56 కోట్లు రాగా, ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, హర్యానాలు ఉన్నాయి.  

బీజేపీ, కాంగ్రెస్‌కు అధిక మొత్తంలో విరాళాలు అందించిన సంస్థ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఈ సంస్థ బీజేపీకి రూ.154.30 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.10 కోట్లు విరాళంగా అందించింది. హైదరాబాద్‌కు చెందిన 25 మంది దాతలు బీజేపీ, కాంగ్రెస్‌లకు విరాళాలు సమర్పించారు. 

 


 

click me!