ఏపీలో ఎంట్రీకి రెడీ.. త్వరలోనే విశాఖలో బీఆర్ఎస్ బహిరంగ సభ!.. భారీగా చేరికలు..?

By Sumanth KanukulaFirst Published Jan 18, 2023, 10:44 AM IST
Highlights

బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తొలుత విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీని కేసీఆర్ ఖరారు చేయనున్నట్టుగా చెప్పారు. ఏపీ నుంచి చాలా మంది పెద్ద పెద్ద నేతలు తమను సంప్రదిస్తున్నారని.. భారీగా బీఆర్ఎస్‌లోకి చేరికలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తామని చెప్పారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీఆర్ఎస్.. సీఎం జగన్ ప్లాన్ బీ  అంటున్న బీజేపీ, టీడీపీ మాటలకు అర్థం లేదని అన్నారు. ఏపీలో కూడా ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు. 

బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న.. తొలుత మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై దృష్టిసారించారు. ఇప్పటికే ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్, రావెల కిషోబాబుతో పాటు పలువురు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ నియమించారు. బీఆర్ఎస్‌లో ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పార్టీ విస్తరణపై వేగం పెంచిన కేసీఆర్.. విజయవాడలో బీఆర్ఎస్ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా  కూడా ఏపీలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇక, తొలుత విజయవాడలోనే బీఆర్ఎస్ సభ ఉంటుందని అనుకున్నప్పటికీ.. ఏపీలో బీఆర్ఎస్ తొలి సభను విశాఖలో నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి బహిరంగ సభను నేడు ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌తో పాటు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరుకానున్నారు. ఈ సభ వేదికగా కేసీఆర్ ఎలాంటి కామెంట్స్ చేయనున్నారు, బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణ గురించి ఏం చెబుతారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. 
 

click me!