
వచ్చే ఎనికల్లో ఉభయగోదావరి జిల్లాలో తెలుగుదేశంపార్టీ కింద మంటలు మండుతున్నాయ్. దాంతో వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్ధితులు తప్పేలా లేదు. పోయిన ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిందంటే అందుకు ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలే అన్న విషయం అందరికీ తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గంలో టిడిపికి 12 సీట్లు వచ్చాయి. ఇక, పశ్చిమగోదావరి జిల్లా గురించి చెప్పేదేముంది? జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాలూ మిత్రపక్షాలు క్లీన్ స్వీప్ చేసాయి. అందులో భారతీయ జనతా పార్టీకి ఒక అసెంబ్లీ భాజపా గెలిస్తే మిగిలిన 14 సీట్లూ టిడిపినే తన్నుకుపోయింది. అన్ని సీట్లు టిడిపికి వచ్చాయంటే పోయిన ఎన్నికల్లో ప్రత్యేక పరిస్ధితులుండటమే. అందులో పవన్ కల్యాణ్ ప్రభావం కూడా బాగానే ఉంది.
సరే, అదంతా గతం. మరి భవిష్యత్తేమిటి? పవన్ కల్యాణ్ మద్దతు వల్లే రాష్ట్రంలోని కాపుల్లో మెజారిటీ టిడిపి, భాజపాకు ఓటేసారన్నది వాస్తవం. అయితే, పోయిన ఎన్నికలకు, రేపు జరగబోయే ఎన్నికలకు ఏమాత్రం పోలికుండదు. ఎందుకంటే, కాపుల్లో చీలికలు వచ్చేసాయి. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గంపై పవన్ ప్రభావం ఎంతుంటుందో ఇపుడే చెప్పలేక పోయినా, ఏకపక్షంగా మాత్రం ఉండదన్నది వాస్తవం. అందుకు కారణం చంద్రబాబునాయుడు, ముద్రగడ పద్మనాభమే.
పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తాననే ఆచరణ సాధ్యం కాని హామీని చంద్రబాబు ఇచ్చారు. అనేక కారణాల వల్ల కాపులు కూడా దాదాపు ఏకపక్షంగా టిడిపిని ఆధరించారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తానిచ్చిన హామీని ఏం చాసారో అందరూ చూస్తున్నదే. అందుకనే ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమాల పేరుతో మంటలు రాజేస్తున్నారు. ముద్రగడ ప్రభావంతో కాపు సామాజికవర్గంలో మెజారిటీ మండిపోతోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు టిడిపికి ఏమాత్రం పడతాయో ఇప్పుడే చెప్ప కష్టం.
ముద్రగడ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతే అయినా పశ్చిమ గోదావరిలో కూడా బాగానే ప్రభావం చూపగలిగిన వారే అనటంలో అనుమానం అక్కర్లేదు. దానికితోడు పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులను జగన్మోహన్ రెడ్డి కూడా సరిచేసుకుంటున్నారు. దాంతో టిడిపికి వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో గడ్డు పరిస్ధితులు తప్పేలా లేవు.