ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారని, వారి కుటుంబం నుంచి ఒకరు పిఠాపురం, ప్రత్తిపాడ, జగ్గంపేటల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఆ హైప్ మొత్తం ఆవిరైంది. అసలు ఆయనను పార్టీలో చేరడానికి కాకినాడకు ఆహ్వానించలేదని తెలిసింది. ఆ మూడు స్థానాల్లోనూ వైసీపీ కొత్త ఇంచార్జీలను ప్రకటించింది.
CM Jagan: ముద్రగడ పద్మనాభంతో వైసీపీ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నదా? దూరం చేయకుండా.. దగ్గరికి తీసుకోకుండా సమ దూరాన్ని పాటిస్తున్నదా? అంటే తాజా పరిణామాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. మొన్నటి వరకు పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని, ఈ మేరకు వైసీపీ నుంచి ఆహ్వానం అందిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలనూ వైసీపీ పరిశీలిస్తున్నట్టు చర్చ జరిగింది. కానీ, ఈ చర్చ అంతా అర్ధంతరంగా ముగిసిపోయింది. ముద్రగడ పద్మనాభానికి వైసీపీ షాక్ ఇచ్చిందా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారని, ఆయన బుధవారం కాకినాడకు రావాలని, అక్కడ పింఛన్ల పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఈ ఆసక్తికర చర్చ ముందుకు సాగలేదు. కాకినాడకు రావాలని అసలు తనకు ఆహ్వానమే అందలేదని తెలిసింది. కాకినాడకు రావాలని సీఎం కార్యాలయం నుంచి ముద్రగడకు ఎలాంటి సమాచారం రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
జనవరి 1వ తేదీన ముద్రగడ ఓ సమావేశం నిర్వహించారు. తన మద్దతుదారులు, మిత్రులను ఆహ్వానించారు. చాలా మంది ఆయన ఆహ్వానం అందుకుని కిర్లంపుడికి వచ్చారు. ఆయన ఫాలోవర్ల కోసం డిన్నర్ కూడా ముద్రగడ ఏర్పాటు చేశారు.
Also Read: YS Sharmila: షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. మేం అలానే చూస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
ముద్రగడను పార్టీలో చేరాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని, ఆయన కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టూ కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే జనవరి 1వ తేదీన పద్మనాభం తనయుడు గిరి మాట్లాడుతూ తమ కుటుంబంలో నుంచి ఒకరు పోటీ చేస్తారని, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేటలలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో ఉంటామని చెప్పారు.
కానీ, మంగళవారం రాత్రికి మరో పరిణామం జరిగింది. వైసీపీ కొత్త ఇంచార్జీల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఈ మూడు స్థానాలకూ ఇంచార్జీలను ప్రకటించింది. దీంతో ముద్రగడ అభిమానులు షాక్ తిన్నారు. ఇప్పుడు వారి ముందు మరొక్క అవకాశం ఉన్నది. ఒక్క కాకినాడ ఎంపీ సీటు మాత్రం ఇప్పడు వారికి అందుబాటులో ఉన్నది.