ఆర్జీవీపై మండిపడుతున్న ఏపీ కాపు నేతలు.. తిరుపతి జిల్లాలో దిష్టిబొమ్మ దగ్దం..

By Sumanth KanukulaFirst Published Jan 10, 2023, 1:31 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌పై పలువురు మండిపడుతున్నారు.

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌పై పలువురు మండిపడుతున్నారు. ఆర్జీవీ ట్వీట్‌పై కాపు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కించపరిస్తే సహించేది లేదని, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆర్జీవీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఆర్జీవీ కాపుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని నిరసన చేపట్టారు. ఆర్జీవీకి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. 

ఇదిలా ఉంటే.. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పలువురు కాపు సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం వెనుక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. కాపులపై కుట్రలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ కాపు జాతిని చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నారని వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌ను కాపు నేతలు ఖండించారు. ఆర్జీవీ చేసిన ట్వీట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఆర్జీవీ ఇటువంటి పిచ్చి వేషాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే.. 
‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు .. RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’’ అంటూ రామ్‌ గోపాల్ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్‌లో ఎవరి పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపైనే ఆయన ఈ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ సామాజిక వర్గాన్ని ప్రస్తావించడంతో ఆయన అభిమానులు, కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వర్మపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!