చంద్రబాబుకు ‘కాపు-బిసి’ షాక్

First Published Nov 21, 2017, 10:33 AM IST
Highlights
  • ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో పోయిన ఎన్నికల్లో  చేసిన వాగ్దానాలే ఇపుడు చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకుంటున్నాయి.

ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో పోయిన ఎన్నికల్లో  చేసిన వాగ్దానాలే ఇపుడు చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకుంటున్నాయి. పోయిన ఎన్నికల్లో చేసిన అనేక ఆచరణసాధ్యం కాని హామీల్లో కాపులను బిసిల్లోకి చేర్చటం కూడా ఒకటి. హామీల్లో కొన్ని చంద్రబాబే చేయగలిగినవైతే మరికొన్ని కేంద్రం చేయాల్సినవి. సరే, కేంద్రం సహకారించకపోయినా చంద్రబాబే చేయలేకపోయినా వచ్చే ఎన్నికల్లో జనాలకు జవాబు చెప్పుకోవాల్సింది మాత్రం చంద్రబాబే కదా?

చంద్రబాబు హామీల్లో రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కాపులను బిసిల్లోకి చేర్చటం ప్రధానమైనవి. వీటిల్లో కూడా మొదటి మూడు హామీలు అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. ఈ హామీలకు కేంద్రానికి ఏమీ సంబంధం లేదు. ఇక, కాపులను బిసిల్లోకి చేర్చటమనే హామీ అమలు చంద్రబాబు చేతిలో లేదు. కానీ ఓట్లు దండు కోవటమే లక్ష్యంతో ఆచరణ సాధ్యంకాని హామీని ఇచ్చేసారు. అదే ఇపుడు పెద్ద సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ అంశం టిడిపిపై తీవ్ర ప్రభావం చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందేనంటూ కాపు నేతలు ఒకవైపు ఉద్యమాలు చేస్తున్నారు. కాపులను బిసిల్లోకి చేరిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించేది లేదంటూ బిసి సామాజికవర్గ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. అంటే హామీని అమలు చేస్తే బిసిల నుండి సమస్యలు వస్తాయి. బిసిల్లోకి చేర్చకపోతే కాపుల ఉద్యమం ఉధృతమవుతుంది. చూడబోతే వచ్చే ఎన్నికల్లో రెండు సామాజికవర్గాలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే అవకాశాలే ఎక్కువున్నాయి.

కాపులను బిసిల్లోకి చేర్చవద్దంటూ బిసి సామాజికవర్గం ఉద్యమకారులు టిడిపిలోని బిసి ప్రజాప్రతినిధుల ద్వారా పెద్ద ఎత్తున చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తున్నారు. అన్నీ విధాల అభివృద్ధిచెందిన కాపులను బిసిల్లోకి చేర్చటాన్ని తాము ఒప్పుకోమంటూ సోమవారం చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇచ్చారు. కాపులను బిసిల్లోకి చేరిస్తే తామంతా అన్యాయమైపోతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా బలంగా ఉన్న కాపులను బిసిల్లోకి చేరిస్తే తమకు అన్యాయం జరుగుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఈయన బిసి నేతే కాదు, టిటిడిపి ఎంఎల్ఏ కూడా. ఈనెల 30న కాకినాడలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు కృష్ణయ్య చెప్పారు. రాబోయే రోజుల్లో కాపు-బిసి రగడ నుండి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి?

click me!