జస్టిస్ కనగరాజ్ కు మరో షాక్: జగన్ ప్రభుత్వ నియామకంపై హైకోర్టులో పిల్

By telugu teamFirst Published Sep 8, 2021, 7:55 AM IST
Highlights

ఏపీ పోలీసుల ఫిర్యాదుల అథారిటీ చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జరిపిన నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కనగరాజ్ నియామకం చెల్లదని అంటూ ఆ పిల్ దాఖలైంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ వి. కనగరాజ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీ చైర్మన్ గా కనగరాజ్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. 

గుంటూరుకు చెందిన న్యాయవాది పారా కిశోర్ ఈ పిల్ ను దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్ 20వ తేదీన ఏపీ హోంశాఖ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఆ పిల్ దాఖలు చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ ను, వ్యక్తిగత హోదాలో కనగరాజ్ ను ఆయన తన వ్యాజ్యంలో ప్రతిపాదులుగా చేర్చారు. 

జస్టిస్ కనగరాజ్ నియామకం ఏపీ ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ నిబంధన 4(ఏ)కు విరుద్ధంగా జరిగిందని ఆయన ఆరోపించారు. జస్టిస్ కనగరాజ్ కు ప్రస్తుతం 78 ఏళ్ల వయస్సు ఉందని, అథారిటీ చైర్మన్ నిబంధనల ప్రకారం 65 ఏళ్లు వచ్చే వరకే ఆ పదవిలో ఎవరైనా ఉంటారని ఆయన అన్నారు. 

వయస్సు రీత్యా అర్హత లేని వ్యక్తిని ఆ పదవిలో నియమించారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కనగరాజ్ ను ఆ పదవిలో నియమించిందని కిశోర్ అన్నారు. 

గతంలో కనగరాజ్ ను ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నియమించిన విషయం తెలిసిందే. అందుకు అవసరమైన జీవోను జారీ చేస్తూ ప్రభుత్వం ఆ నియామకాన్ని జరిపింది. అయితే, జీవోలను హైకోర్టు కొట్టేసింది. దీంతో కనగరాజ్ ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

click me!