ఇళ్లపట్టాల పంపిణీ వాయిదా అందుకోసమే..: మాజీ మంత్రి సంచలనం

By Arun Kumar PFirst Published Oct 29, 2020, 6:51 PM IST
Highlights

అనపర్తిలో మాజీ జడ్పీటీసీ కత్తి భగవాన్ రెడ్డి పట్టాల పంపిణీపై కేసు వేసింది వాస్తవం కాదా..? అని కాల్వ శ్రీనివాసులు నిలదీశారు. 

అమరావతిపై నోటికొచ్చిన అబద్ధాలాడి ప్రజాక్షేత్రంలో అభాసుపాలైన అబద్ధాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేటికీ తీరు మార్చుకోక మరో అబద్ధమాడుతున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. సెంటు పట్టా పంపిణీ పేరుతో ఇప్పటికే వైసీపీ నేతలు రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని...ఈ అవినీతిని కొనసాగించేందుకు ఇళ్ల పట్టాల పంపిణీని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. 

''తమ కుట్రను కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతున్నారు. అనపర్తిలో మాజీ జడ్పీటీసీ కత్తి భగవాన్ రెడ్డి పట్టాల పంపిణీపై కేసు వేసింది వాస్తవం కాదా..? మొత్తం 38 వేల ఎకరాలలో కోర్టు కేసుల కారణంగా పంపిణీ ఆగిపోయింది 2వేల ఎకరాలు మాత్రమే. మిగిలిన 36వేల ఎకరాలు పంచకుండా ఆపడం వెనుక అధికార పార్ట నేతల అవినీతి కొనసాగింపు కోసం కాదా..?'' అని నిలదీశారు. 

''టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తైన 2,62,216 టిడ్కో ఇళ్లను డిపాజిట్ దారులైన లబ్ధిదారులకు 17 నెలలైనా ఎందుకు ఇవ్వలేదు..? 50శాతానికి పైగా పనులు పూర్తైన 4,96,572 ఇళ్లకు సంబంధించి మిగిలిన పనులు పూర్తిచేసి లబ్దిదారులకు అందించకపోవడం పేదలకు ద్రోహం చేయడం కాదా..? వైసీపీ నేతల దుర్మార్గపూరిత విధానాల కారణంగా లబ్దిదారులు ఒకవైపు అద్దెలు కట్టుకుంటూ, మరోవైపు వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు'' అని వెల్లడించారు. 

''తెలుగుదేశం హయాంలో పేదలకు 10 లక్షల ఇళ్లను నిర్మించడం జరిగింది. దీంతో పాటు 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన 4,40,426 ఇళ్లకు అదనంగా రూ.25 నుంచి 50 వేల దాకా ఆర్థిక సాయం అందించి పేదలకు పక్కా ఇళ్లు అందించాం. మరలా తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి మరో 10 లక్షల మందికి ఇళ్లు అందేవి'' అన్నారు. 

''పేదలకు ఉచితంగా ఇళ్లు అందజేస్తామని, కట్టిన డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి.. 17 నెలల్లో ఒక్క ఇంటినీ నిర్మించకపోగా తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన తాళాలను సైతం వెనక్కు లాక్కున్నారు. ఇది దుర్మార్గం కాదా..? సంక్రాంతి లోపు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అప్పగించకుంటే.. ఇళ్లను స్వాధీనం చేసుకునే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుంది'' అని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. 
 

click me!