కాకినాడ పోర్టు అడ్డాగా రేషన్ మాఫియా... మాజీ ఎమ్మెల్యే అవినీతి లెక్కలు చెప్పిన మంత్రి నాదెండ్ల

By Galam Venkata Rao  |  First Published Jul 4, 2024, 5:40 PM IST

‘‘దోపిడీకి పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. మాజీ ఎమ్మెల్యే కుటుంబం చేసిన అవినీతి మామూలుగా లేదు. రేషన్ మాఫియాని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఆ నెట్వర్క్ కట్ చేయాలి. రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం.’’


దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యే  కుటుంబం బియ్యం మాఫియాను పెంచి పోషించిందన్నారు. వారం రోజుల్లో రూ.159కోట్లు విలువైన 35,404 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. పేదల పొట్ట కొట్టి.. కోట్లు దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ప్రతి జిల్లాలో తనిఖీలు చేపట్టి బియ్యం మాఫియాను నిర్మూలిస్తామన్నారు. గత అరాచక పాలనలో రైతులు చితికిపోయారని, రైతుల నుంచి సేకరించిన ఆహార ధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదన్నారు. రైతుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.1000 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. 

విజయవాడ కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత ఐదేళ్లలో రైతులు అన్ని విధాలా చితికిపోయారు. పంట పండించి నలుగురికీ అన్నం పెట్టే రైతుని నిస్సహాయ స్థితిలోకి గత ప్రభుత్వం, నాయకులు నెట్టేశారు. ఏటా కన్నీటితో బకాయిల కోసం ఎదురుచూపులు చూసే దుస్థితికి తెచ్చారు. రైతుల వద్ద కొన్న ఆహార ధాన్యాలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా బకాయిలు పెట్టి రైతు ధైర్యం కోల్పోయేలా చేశారు’’ అని విమర్శించారు.

Latest Videos

రూ.36వేల కోట్లు అప్పులు...
‘‘పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌ని రూ.36,300 కోట్ల అప్పుల పాలుచేశారు. అప్పు చేసినా రైతులకు చెల్లింపులు చేయాలేదు. రూ.1,659 కోట్లు బకాయిలు వదిలేశారు. ఆహార భద్రత కల్పించే పౌరసరఫరాల శాఖను అప్పులపాలు చేశారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి బకాయిలు వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. రైతుల దగ్గర కొన్న ధాన్యానికి మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి వివరించాం. ముఖ్యమంత్రి స్పందించి రైతులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో తొలి విడతగా రూ. వెయ్యి కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేశారు. మొదట ఈ రూ. వెయ్యి కోట్లు రైతులకి ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తాం. ముందుగా ధాన్యం ఎవరి వద్ద సేకరించారో గుర్తించి ప్రణాళికాబద్దంగా బకాయిలు చెల్లిస్తాం’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఏ జిల్లాకి ఎంత..?
‘‘పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.565.95 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.121.96 కోట్లు, కోనసీమ జిల్లాకు రూ.163.59 కోట్లు, కాకినాడ జిల్లాకు రూ.21.92 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.19.96 కోట్లు, బాపట్ల జిల్లాలో రూ.6.61 కోట్ల చొప్పున చెల్లించనున్నాం. సుమారు 50వేల మంది రైతులకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టాం. మిగిలిన బకాయిలు కూడా కొద్ది రోజుల్లో చెల్లిస్తాం. దీంతోపాటు మరో రూ.2వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి కూడా ఇటీవలే చెల్లించాం. వచ్చే ఏడాది మార్చి 31నాటికి మరో రూ.10 వేల కోట్లు బకాయిలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. బ్యాంకుల నుంచి కూడా సహాయం కోరుతున్నాం’’ అని మంత్రి వెల్లడించారు.

నాణ్యత, తూకంలో తేడా వస్తే చర్యలు...
‘‘ఒక మార్పు తీసుకురావాలని మేం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం, నిత్యవసర సరుకులు కచ్చితంగా నాణ్యతతో ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టబోతున్నాం. తూకంలో తేడా వచ్చినా, సరుకు పక్కదోవ పట్టించాలని చూసినా ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు.

ఫుడ్ మాఫియాని ఉపేక్షించం...
‘‘గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ బియ్యం ఎగుమతులపై తనిఖీలు జరిపాం. కాకినాడ పోర్టులో రూ.159 కోట్ల విలువైన 35,404 మెట్రిక్ టన్నులు అక్రమంగా నిల్వ చేసిన ధాన్యాన్ని సీజ్ చేశాం. రాష్ట్రంలో ఎన్నడూ ఇలా జరిగి ఉండదు. ఫుడ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. రేషన్ మాఫియాని వ్యవస్థీకరించిన తీరు కాకినాడ పర్యటనలో చూశాం. పోర్టు సమీపంలో గోడౌన్స్ లో ఈ మొత్తం సీజ్ చేశాం. మొట్టమొదటి సారి గోడౌన్‌లోకి అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయి. నెల రోజుల్లో మార్పు తీసుకువస్తాం. కేంద్రం ఇస్తున్న మొత్తం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి కిలో బియ్యం రూ.45.33కి ఖర్చు చేసి లబ్దిదారుడికి రూపాయికి అందిస్తుంటే.. దాన్ని రూ.7కి కొని స్కాములకు పాల్పడుతున్నారు. ప్రజలు ఈ స్కాముల్లో భాగస్వాములు కావద్దు. ప్రభుత్వం ఇచ్చే కానుకని గౌరవించండి’’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.

‘‘దోపిడీకి పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. మాజీ ఎమ్మెల్యే కుటుంబం చేసిన అవినీతి మామూలుగా లేదు. రేషన్ మాఫియాని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఆ నెట్వర్క్ కట్ చేయాలి. రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం. కార్పోరేషన్‌కి రూ.1500 కోట్లు ఆర్థికంగా నష్టపరిచేలా 9,260 ఎండీయూ వ్యాన్ యూనిట్లు కొన్నారు. ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయంతో కార్పోరేషన్‌కి రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. వీటిని కొనసాగించాలా లేదా అన్నది అందరితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

click me!