
ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయాలు ఒక ఎత్తయితే.. కడప జిల్లాలో మరో ఎత్తు. పౌరుషాల పురిటిగడ్డగా పేరొందిన ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం తొలి నుంచి ఎక్కువే. ఉమ్మడి ఏపీ అయినా, నవ్యాంధ్ర అయినా రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ కడప వైపే తిరుగుతాయి. దేశానికి ఉద్ధండులైన నేతలను అందించింది కడప గడ్డ. ఎద్దుల ఈశ్వరరెడ్డి, కందుల ఓబుళరెడ్డి, డీఎన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి వంటి హేమాహేమీలు ఈ ప్రాంతానికి చెందినవారే.
వజ్రాలు, ఇతర విలువైన ఖనిజాలకు కడప జిల్లా పెట్టింది పేరు. పెన్నాతో పాటు కుందూ నదీ తీరాలలో వజ్రాలు విరివిగా లభించేవి. సిమెంట్ పరిశ్రమకు ప్రధానమైన సున్నపురాయికి కడప కేంద్రం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కడప కంచుకోట. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కడప పార్లమెంట్ పరిధి నుంచే రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కడప ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024.. వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం :
1952లో ఏర్పడిన కడప పార్లమెంట్ నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ తర్వాత వైసీపీకి కడప అడ్డాగా మారింది. కాంగ్రెస్ పార్టీ పది సార్లు, సీపీఐ నాలుగు, వైసీపీ మూడు సార్లు , టీడీపీ ఒకసారి విజయం సాధించింది. కడపలో మొత్తం 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 10 సార్లు వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధించడం గమనార్హం. తండ్రి కొడుకులు వైఎస్ఆర్, వైఎస్ జగన్‌లు కడప నుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
కడప లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్లు 15,70,330 . వీరిలో పురుషులు 7,95,503 మంది.. మహిళలు 7,74,593. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కడప పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వైఎస్ అవినాష్ రెడ్డికి 7,83,499 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఆదినారాయణ రెడ్డికి 4,02,773 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ దాదాపు 3,80,726 ఓట్ల మెజారిటీతో కడపను సొంతం చేసుకుంది.
కడప ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. ఈసారి వైసీపీకి కష్టమేనా :
తన కంచుకోటకు బీటలు వారకుండా చూసుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. కానీ ఈసారి మాత్రం కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలు కొత్తగా వుండేలా వున్నాయి. వైఎస్ వివేకా హత్య ప్రభావం, జగన్ పరిపాలన బట్టి జనం ఓట్లేసే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్ష పడాలంటే ఈసారి జగన్‌కు ఓటు వేయొద్దని వివేకా కుమార్తె డాక్టర్ సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వివేకా సతీమణి సౌభాగ్యమ్మను టీడీపీ ఎంపీ బరిలో నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు జగన్ చెల్లెలు షర్మిల సైతం ఆయనకు వ్యతిరేకంగా మారడంతో కడపలో రాజకీయాలు వేడెక్కాయి. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి , ఆయన కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీని ప్రభావం కూడా వైసీపీపై ప్రభావం చూపవచ్చు. కానీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో, సొంత పార్లమెంట్ సీటును ఎట్టిపరిస్ధితుల్లోనూ కోల్పోయేది లేదని వైసీపీ నేతలు తేల్చిచెబుతున్నారు.
కడప లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ గెలిచి 40 ఏళ్లు :
టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ తెలుగుదేశం గెలిచి నాలుగు దశాబ్ధాలు గడుస్తోంది. పార్టీ ఆవిర్భవించిన కొత్తలో 1984లో టీడీపీ అభ్యర్ధి డీ నారాయణ రెడ్డి (డీఎన్ రెడ్డి) విజయం సాధించారు. నాటి నుంచి నేటి వరకు కడపలో పాగవేయాలని తెలుగుదేశం ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ వైఎస్ ఛరిష్మా , వ్యూహాల ముందు అవి పనిచేయలేదు. ఈసారైనా కడప లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోవాలని టీడీపీ తీవ్ర కసరత్తు ప్రారంభించింది. కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధిగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. అలాగే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కే విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డి పేర్లను కూడా టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.