ఊహాగానాలు: చంద్రబాబుకి షాక్, జనసేనలోకి జ్యోతుల నెహ్రూ?

By telugu teamFirst Published Apr 24, 2021, 12:14 PM IST
Highlights

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై స్పష్టత రావడం లేదు.

కాకినాడ: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. జ్యోతుల నెహ్రూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు నుంచి తప్పుకుని టీడీపీలో చేరారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2016లో టీడీపీలో చేరారు. 

టీడీపీ అధిష్టానం పెద్దలకు, జ్యోతుల నెహ్రూకు మధ్య గ్యాప్ పెరిగినట్లు ప్రచారం సాగుతోంది. నెహ్రూ పార్టీ మారుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఊహాగానాలపై జ్యోతుల నెహ్రూ శిబిరం నుంచి స్పష్టత రావడం లేదు. వారు ఔనని గానీ కాదనీ గానీ చెప్పడం లేదు. దీంతో జ్యోతుల నెహ్రూ పార్టీ మారుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని జ్యోతుల నెహ్రూ వ్యతిరేకించారు. అందుకు నిరసనగా ఆయన పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే, తాను పార్టీలోనే ఉంటానని చెప్పారు. అయితే, అప్పటి నుంచి ఆయన పెద్దగా మీడియా ముందుకు రాలేదు. తిరుపతిలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందనే విషయంపై మాత్రం ఆయన స్పందించారు. 

తిరిగి వైసీపీలో చేరే అవకాశం లేకపోవడంతో జ్యోతుల నెహ్రూ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే, మరో వాదన కూడా ముందుకు వస్తోంది. నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఆ మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనలో కూడా పాల్గొన్నారు 

వచ్చే ఎన్నికల్లో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి నవీన్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునైనా జ్యోతుల నెహ్రూ పార్టీ మారబోరనే మాట వినిపిస్తోంది. అయితే, జ్యోతుల నెహ్రూ టీడీపీలో ఎక్కువ రోజులు ఉండబోరనే ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. ఈ విషయంపై టీడీపీ పెద్దలు ఆయనతో మాట్లాడిన దాఖలాలు కూడా లేవని అంటున్నారు. ఏమైనా, జ్యోతుల నెహ్రూ బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఆ ప్రచారానికి తెర పడే అవకాశం లేదు.

click me!