నంద్యాలలో జర్నలిస్ట్ దారుణ హత్య..: కానిస్టేబుల్ పనే?

By telugu news teamFirst Published Aug 9, 2021, 8:14 AM IST
Highlights

దీన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్‌ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్‌ కాలనీలోని ఆటోస్టాండ్‌ వద్దకు పిలిపించాడు.

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్నలిస్ట్ ని అతి దారుణంగా హత్య చేశారు. యూట్యూబ్ ఛానెల్ వీ5 విలేకరిగా పనిచేస్తున్న కేశవను చంపేశారు. అతను పదేళ్లుగా.. విలేకరిగా పనిచేస్తున్నాడు. కాగా.. అతనిపై కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు పగపట్టి.. ఈ హత్య చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్‌ కానిస్టేబుల్‌ సుబ్బయ్యకు ఉన్న సంబంధాలను బట్టబయలు చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి కానిస్టేబుల్‌ సుబ్బయ్యను సస్పెండ్‌ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్‌ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్‌ కాలనీలోని ఆటోస్టాండ్‌ వద్దకు పిలిపించాడు.

కేశవ తోటి రిపోర్టర్‌ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్‌ కాలనీకి వెళ్లారు. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్‌ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. 

అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్‌ అవినీతి వ్యాపారాన్ని బట్టబయలు చేసిన విలేకరిని హత్యచేయటం పట్ల జర్నలిస్ట్‌ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. 

click me!