వంగి నమస్కారం:అధికారుల తీరుపై జేసీ నిరసన, కార్యాలయంలోనే బస

By narsimha lode  |  First Published Aug 3, 2021, 9:37 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం చోటు చేసుకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసిన సమయానికే ఎమ్మెల్యే కరోనాపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశానికి రాలేదు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.



తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకొంది. మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇవ్వకుండానే సెలవుపై వెళ్లడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ వచ్చేవరకు మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని ఆయన నిరసనకు దిగారు.

మున్సిపల్ ఛైర్మెన్  జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ నెల 2వ తేదీన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయమై శనివారం నాడే జేసీ ప్రభాకర్  రెడ్డి కమిషనర్ సహ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే సోమవారం నాడు అదే సమయానికి  ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి నగరంలో కరోనా వైరస్ మూడో దశపై అవగాహన ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. దీంతో అధికారులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

Latest Videos

కరోనా అవగాహన ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది  ర్యాలీ పూర్తి కాగానే ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఈ ర్యాలీ పూర్తయ్యాక అధికారులు వస్తారని మున్సిపల్ కార్యాలయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లోనే ఎదురు చూశారు.అంతేకాదు మధ్యాహ్నం తర్వాత మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి సెలవుపై వెళ్లారు. తన భాద్యతలను మరొకరికి అప్పగించారు. ఈ విషయం తెలిసిన చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు వచ్చేవరకు తాను మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కొందరు అధికారులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగానే వారికి వంగి వంగి నమస్కరించి జేసీ ప్రభాకర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.కనీసం ముందుగా సమాచారం ఇవ్వకుండా కమిషనర్ ఎలా వెళ్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం నాడు రాత్రి భోజనం చేసి అక్కడే నిద్ర చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

ఇదిలా ఉంటే తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో 26 మంది సిబ్బంది కన్పించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ  సమావేశం ఉందని సమాచారం ఇచ్చామన్నారు. కానీ ఈ సమావేశానికి ఎవరూ రాలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మున్సిపల్ సిబ్బంది  ఆచూకీ కనుగొనాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

click me!