తమ్ముడు దురుసుగా మాట్లాడాడు తప్పే.. జగన్‌కు జేసీ దివాకర్ రెడ్డి క్షమాపణలు

By Siva KodatiFirst Published Jun 13, 2020, 6:57 PM IST
Highlights

వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫైరయ్యారు. ఇదే సమయంలో కొన్నేళ్ల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా మాట్లాడటం తప్పేనని అంగీకరించిన ఆయన... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు

వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫైరయ్యారు. ఇదే సమయంలో కొన్నేళ్ల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా మాట్లాడటం తప్పేనని అంగీకరించిన ఆయన... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.

కోహిమా వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం అనంతపురంలోని తన నివాసంలో జేసీ మీడియాతో మాట్లాడుతూ.. డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదని మాపై కేసు పెట్టారని  జేసీ అన్నారు.

తమ ట్రావెల్స్‌పై రోజూ కేసులు రాయడమే పనిగా పెట్టుకున్నారని దివాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారని జేసీ ధ్వజమెత్తారు.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్షసాధింపేనన్న ఆయన.. ఎక్కడైనా ఆర్టీసీ  బస్సు డ్రైవర్లు బెల్ట్ పెట్టుకోవడం చూశామా అని నిలదీశారు. ఒక నిరసన ప్రదర్శన సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వాడిన ఒక అసభ్య పదాన్ని పట్టుకునే జగన్ ప్రభుత్వం ఇంతటి దారుణానికి తెరదీసిందని దివాకర్ వ్యాఖ్యానించారు.

కొన్ని మాటలు నాకు ఊతపదాలని.. వాటి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని జేసీ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి జగనే రాజు, మంత్రి అని.. దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి రాడు... రాబోడని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

ఏపీలో తుగ్లక్ పాలన సాగుతుందన్నారు.  తాము ఎట్టి పరిస్ధితుల్లో తెలుగుదేశం పార్టీని వీడేది లేదని జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పుడు తమ్ముడిని జైళ్లో వేశారు.. రేపు తనను కూడా లోపల వేస్తారని జేసీ జోస్యం చెప్పారు. జగన్‌కు అల్లా, యేసు, వెంకన్నపై నమ్మకం లేదని.. కేవలం అహంకారమే ఉందన్నారు. 

click me!