
మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? గడచిన రెండు రోజులుగా చంద్రబాబునాయుడు నివాసం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు ఊతమిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో భారీ భూకుంభకోణానికి తెరలేచిందన్నది వాస్తవం. వేల కోట్ల విలువైన కుంభకోణానికి సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరో ఐదుగురు ఎంఎల్ఏలు ఇరుక్కుపోయారు. నారా లోకేష్ సూత్రదారుడని కూడా వైసీపీ ఆరోపిస్తోంది.
వేలాది ఎకరాలు కబ్జా జరిగిందంటూ సుమారు 20 రోజుల క్రితం చింతకాయల బాహాటంగా ఆరోపించారు. దాంతో పార్టీ, ప్రభుత్వంలో వేడి మొదలైంది. దాన్ని వైసీపీ అందిపుచ్చుకున్నది. అదే సమయంలో ప్రభుత్వ భూములు ట్యాంపరింగ్ జరిగిందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ధృవీకరించటంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. అప్పటి నుండి జరిగిన అనేక పరిణామాలు అందరికీ తెలిసిందే.
చింతకాయలకు వ్యతిరేకంగా గంటా చంద్రబాబుకు రాసిన లేఖ, దాని పర్యవసానాలు అందరూ చూస్తున్నదే. ఇక్కడే సమస్య మొదలైంది చింతకాయలకు. నిన్న చంద్రబాబు ఇంటిలో జరిగిన సమన్వయ కమిటి సమావేశంలో భూకుంభకోణంపై జరిగిన చర్చలో సిఎం చింతకాయలనే తప్పుపట్టారట. చింతకాయల తన పరిధిదాటి వేలు పెట్టారంటూ చంద్రబాబు ఆక్షేపించారట. అప్పటి నుండి చింతకాయల మనస్తాపానికి గురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గంటా-చింతకాయలకు ఒకరంటే ఒకరికి పడదన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య సయోధ్య చేయలేక చంద్రబాబే చేతులెత్తేసారు. అటువంటిది తాజాగా వెలుగు చూసిన భూకుంభకోణంతో వీరిద్దరి మధ్య అగాధం మరింత పెరిగింది. భూకుంభకోణానికి ప్రధానపాత్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటాను వదిలేసి తనను ఆక్షేపించటం పట్ల చింతకాయల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
గంటాతో తనకు పొసగని కారణంగా పార్టీ, ప్రభుత్వంలో తనకు ఇబ్బందులు మొదలైనట్లు చింతకాయల అనుమానంతో ఉన్నారు. కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు తాజా వైఖరే అందుకు నిదర్శనంగా చింతకాయల భావిస్తున్నారు. కుంభకోణానికి పాల్పడిన వ్యక్తిని వదిలేసి తనను లక్ష్యంగా చేసుకోవటాన్ని చింతకాయల జీర్ణించుకోలేకున్నారట.
అయితే, ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకునే పరిస్ధితిలో కూడా మంత్రి లేరు. ఇప్పటికే తన మాటకు పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ విలువ లేకుండా పోయిందన్న విషయమైతే చింతకాయలకు అర్ధమైపోయింది. అదే విషయాన్ని తన సన్నిహితులు, మద్దతుదారులతో చర్చిస్తున్నారట. దాంతో ఇదే పరిస్ధితి ఇక ముందు కూడా కొనసాగితే ఏం చేయాలంటూ చింతకాయల ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.