
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి రాజకీయాలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న పవన్ ఇప్పటి నుంచే కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. ట్విటర్ ద్వారా అభిమానులకు చేరువవుతున్న పవన్ తన రాజకీయ కార్యచరణను ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.
పవన్ కల్యాణ్ త్వరలో చిత్తూరు జిల్లా యాత్రను చేయబోతున్నారు. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్ర గురించిన పూర్తి వివరాలను ఈ రోజు (సోమవారం) సాయంత్రం లోపు వెల్లడించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్వీట్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేశారు. `సాయంత్రంలోపే నా నాలుగు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన వివరాలను వెల్లడిస్తాన`ని పవన్ ట్వీట్ చేశారు.
దీనితోపాటు.. పలు మీడియా సంస్థలు, టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశిస్తూ కూడా పవన్ చాలా ట్వీట్లు చేశారు. 6నెలల పాటు తనపై ఎమోషనల్ అత్యాచారం చేశారని ఆయన అన్నారు. ఇలాంటి ఎమోషనల్ అత్యాచారం చేస్తున్న మీడియా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిర్భయా చట్టం తీసుకురావాలంటూ ప్రశ్నించారు. “త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది.వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుంది. జర్నలిజం విలువలు తో ఉన్న చానెల్స్ , పత్రికలు, సమదృష్టికోణం తో ఉండే ఛానెల్సని, పత్రికలకి నిలబడతాం. మనలని,మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి??’’ అంటూ పవన్ పలు ట్వీట్లు చేశారు.
యాంకర్ శ్రీరెడ్డి ఇటీవల పవన్ ని అభ్యంతరక పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పవన్ పలు మీడియా సంస్థలపై మండిపడుతూ గత నాలుగు రోజులుగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు.