
విజయవాడ: కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ (BR Ambekar) పేరు చేర్చడంపై వివాదం చెలరేగి అమలాపురంలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లు కారకులు మీరంటే మీరంటూ అధికార, ప్రతిపక్షాలు ఆరోపించుకుంటున్నారు. అధికార వైసిపి నాయకులు ఇది చంద్రబాబు నాయుడు (chandrababu naidu), పవన్ కల్యాణ్ (pawan kalyan) కలిసి పన్నిన కుట్రేనని ఆరోపిస్తున్నారు. టిడిపి, జనసేన నాయకులేమో వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్య నుండి దృష్టిమళ్లించడానికే ప్రభుత్వమే ఈ అల్లర్లు సృష్టించిందని ఆరోపిస్తున్నారు. ఇలా కోనసీమ అల్లర్లు రాజకీయ విమర్శలకు దారితీసాయి.
తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ (pothina mahesh) వైసిపి నాయకులు పవన్ కల్యాణ్ పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కడపకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరుని పెట్టి దాన్ని నిరూపించుకోవాలని సూచించారు. లేదంటే పులివెందుల కేంద్రంగా 27వ జిల్లాగా బీమ్ రావ్ జిల్లాను ఏర్పాటు చేయాలని... ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాన్ని ఈ విధంగా చేస్తే బాబాసాహెబ్ స్ఫూర్తి వెల్లడవుతుందని మహేష్ అన్నారు.
''భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ ఆ మహనీయుని ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పచ్చటి కోనసీమలో అల్లర్లకు కారణమైన వైసీపీ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కులాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశ్యంతో, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ప్రభుత్వం జిల్లాల పేరు అంశాన్ని తెర మీదకు తెచ్చింది'' అని పోతిన మహేష్ ఆరోపించారు.
''రాష్ట్రంలో అల్లర్లు జరుగుతుంటే బాధ్యతగా స్పందించాల్సిన మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాల పేర్లు మార్చడం ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. పేర్లు మార్చడంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు కూడ ఒక నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలని జనసేన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం'' అన్నారు.
''కడపకు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారు. వైద్య వృత్తిలో ఉన్న వైఎస్ఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే అందుకు కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఇవాళ కశ్మీర్ భారత భూభాగంలో ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ మహనీయుడి ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేస్తోంది'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
''మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పులివెందుల కేంద్రంగా భీమ్ రావు జిల్లా ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఒప్పించాలి. ఇందుకోసం సీనియర్ మంత్రులయిన ఆ ముగ్గురూ బాధ్యత తీసుకోవాలి'' అన్నారు.
' వైసీపీ వాళ్ళు అమలాపురం ఘర్షణల మీద పదే పదే మాట్లాడుతున్నారు. జనసేన పార్టీకి అక్కడ జరిగిన అల్లర్లకు సంబంధం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి ఫోటోలో అల్లర్లకు కారణంగా చెబుతున్న వ్యక్తి వైసీపీలో ఉన్న మేధావి, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో దిగిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ నాయకులు ముందుగా దానికి సమాధానం చెప్పాలి'' అని పోతిన మహేష్ నిలదీసారు.