
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap budget 2022) ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని విధంగా ఉందని జనసేన పార్టీ (janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) వ్యాఖ్యానించారు. శుక్రవారం మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డాంబికాలు, ప్రచార ఆర్భాటాలకు బడ్జెట్‌ను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని పదే పదే గొప్పలు చెప్పుకున్న నాయకులు... ఏ వర్గానికి కూడా న్యాయం చేసింది లేదంటూ నాదెండ్ల దుయ్యబట్టారు.
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బుగ్గన (buggana rajendranath reddy ) మాటల్లో ముఖ్యమంత్రిని (ys jagan) పొగిడారో.. రాష్ట్ర ప్రజలకు ఏమీ తెలియదులే అని ఆయన క్యారెక్టర్ గురించి చెప్పే ప్రయత్నం చేశారో అర్ధం కాలేదంటూ మనోహర్ దుయ్యబట్టారు. సీఎం అహంకారంతో రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ కవి సూక్తుల బదులు వేమన సూక్తి అయిన అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను... సజ్జనుండు పలుకు చల్లగాను అని చెప్పి ఉంటే ఆయనకు కరెక్టుగా సరిపోయేదని సెటైర్లు వేశారు.
ప్రభుత్వ తీరుతో క్షేత్ర స్థాయిలో సామాన్యుడు అనేక ఇబ్బందులు పడుతున్నాడని.. ఆ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే జనసేన పార్టీ రోడ్ల దుస్థితిపై (ap roads) డిజిటల్ క్యాంపెయినింగ్ చేసిందని నాదెండ్ల గుర్తుచేశారు. గత ఆర్ధిక సంవత్సరం రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం కోసం బడ్జెట్ లో రూ. 7500 కోట్లు కేటాయించారని.. దానిని సవరించి రూ. 5 వేల కోట్లకు తగ్గించారని ఆయన మండిపడ్డారు. చివరికి మరమ్మతుల కోసం ఎంత విడుదల చేశారో ఎవరికీ తెలియదని.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా గోతులు పడ్డ రోడ్లే దర్శనమిచ్చాయని నాదెండ్ల చెప్పారు.
జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయినింగ్‌తో ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రూ. 2 వేల కోట్లు రోడ్ల మరమ్మతుల కోసం విడుదల చేస్తున్నామని ప్రకటించారని మనోహర్ వ్యాఖ్యానించారు. రోడ్ల మరమ్మతులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని గత ఏడాది నవంబర్‌లో చెప్పారని.. తరువాత తుపాన్లు వచ్చాయని పనులు నెలల తరబడి వాయిదా వేసుకుంటూ వెళ్లారని నాదెండ్ల దుయ్యబట్టారు. గతేడాది రూ. 2 వేల కోట్లే ఖర్చు చేయని మీరు ఇప్పుడు రూ. 8500 కోట్లు ఖర్చు చేస్తామని చెబితే ఎవరు నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.
97 వేలమంది మత్స్యకారులకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నామని ఆర్ధిక మంత్రి గొప్పగా చెప్పుకున్నారంటూ నాదెండ్ల ఎద్దేవా చేశారు. సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారులు దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉంటే కేవలం 97 వేల మందికి రూ. 10 వేలు చొప్పున ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులు, వారి స్థితిగతులు చూస్తే వాళ్లు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు మీకు అర్ధమవుతాయంటూ నాదెండ్ల చురకలు వేశారు. పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమతో కలిపి మత్స్యకార శాఖకు రూ. 1568 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే కేవలం 10 శాతం మాత్రమే పెంచారని... ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ కోణం నుంచి చూసినా నిరుపయోగమేనని మనోహర్ ఆరోపించారు.
ప్రతి ఏడాది బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారని... ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లక్షా 61 వేల కోట్లేనని ఆయన గుర్తుచేశారు. మొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ. 2 లక్షల 56 వేల కోట్లు అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా రూ. 2 లక్షల 56 వేల కోట్లు అని నాదెండ్ల పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంతో (telangana budget 2022) మనం పోల్చుకోగలుగుతామన్న ఆయన... జనాభా, విస్తీర్ణం పరంగా మన రాష్ట్రం పెద్దదని చెప్పారు. మనకున్నన్ని సహజ వనరులు ఆ రాష్ట్రానికి లేవని.. ఇన్ని అంశాల్లో ఇంత తేడా ఉంటే వాళ్ల బడ్జెట్, మన బడ్జెట్ మాత్రం ఒక్కటేనంటూ మనోహర్ పేర్కొన్నారు.
పరిశ్రమల శాఖకు బడ్జెట్ కేటాయించడం.... రెండు, మూడు నెలలలో సవరిస్తున్నారని, ఇలా చేసే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు గత ఏడాది రూ. 1133 కోట్లు కేటాయించారని.. చివరకు సవరించి రూ. 331 కోట్లకు తీసుకొచ్చారని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. అదేవిధంగా పరిశ్రమల శాఖకు గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 2540 కోట్లు కేటాయించారని ఆయన వెల్లడించారు. మన ప్రాంతానికి అద్భుతంగా పరిశ్రమలు వస్తాయని.. యువతకు ఉపాధి దొరుకుంతుందని చెప్పారంటూ చురకలు వేశారు. చివరకు ఆ బడ్జెట్ కేటాయింపులను సవరించి రూ. 1906 కోట్లకు కుదించారంటూ నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా తమిళ కవి గురించి మాట్లాడారంటే ముఖ్యమంత్రికి, ఆయన సహచర మంత్రులకు అక్కడ పెట్టుబడులు ఉన్నట్లు అర్థమవుతోందని మనోహర్ ఆరోపించారు.