జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ పార్టీ నాయకుడు శివశంకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
విశాఖపట్నం : జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ విశాఖఫట్నంలోని రుషికొండ పరిశీలనపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వైసిపి ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించిన రుషికొండను తవ్వేస్తున్నారని జనసేన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా విశాఖలోనే వున్న పవన్ రుషికొండలో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించడానికి సిద్దమయ్యారు. కానీ ఆయనను పోలీసులు అనుమతిస్తారా అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. అయితే పోలీసులు అనుమతించినా అనుమతించకున్నా పవన్ కల్యాణ్ రుషికొండకు వెళ్లి తీరతారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ స్పష్టం చేసారు.
సముద్రతీరంలో ప్రకృతి అందాలతో రమణీయంగా వుండే రుషికొండను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని శివశంకర్ అన్నారు.ప్రజల కోసం రాజకీయాలు చేసే బాధ్యతగల నాయకుడిగా పవన్ కల్యాణ్ రుషికొండను పరిశీలించాలని అనుకుంటున్నాడు... ఎలాంటి నిబంధనల ఉళ్లంఘన చేయకుండానే తవ్వకాలు జరిపితే అడ్డుకోవాలని ప్రయత్నించడం ఎందుకుని ప్రశ్నించారు. ఖచ్చితంగా పవన్ రుషికొండకు వెళతారు... అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు వుంటాయని జనసేన నేత హెచ్చరించారు.
రుషికొండ నిషేధిత ప్రాంతమేమీ కాదు రక్షిత ప్రదేశం మాత్రమేనని శివశంకర్ అన్నారు. అలాంటి ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు చెక్ పోస్టులు పెట్టిమరీ అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఎవ్వరు అడ్డుకున్నా ప్రజల కోసం పోరాటం చేస్తున్న పవన్ రుషికొండకు వెళ్లి తీరతారని స్ఫష్టం చేసారు. రుషికొండ పీపుల్స్ ల్యాండ్... అక్కడికి వెళ్లేందుకు ఎవ్వరి పర్మీషన్ అవసరం లేదన్నారు శివశంకర్.
Read More నేడు రిషికొండకు పవన్: పోలీసులు అనుమతించేనా?
రుషికొండపై జరుగుతున్న తవ్వకాలపై ప్రజలకు అనేక అనుమానాలు వున్నాయి... అందువల్లే వారి పక్షాన పవన్ అక్కడికి వెళుతున్నారని శివశంకర్ తెలిపారు. ఇవాళ 3 గంటలకు రుషికొండలో జరుగుతున్న తవ్వకాలను పవన్ నిశితంగా పరిశీలిస్తారు... అనంతరం అక్కడ ఏం జరుగుతుందో బయటపెడతారని అన్నారు. పవన్ ను అడ్డుకోడానికి పోలీసులకే కాదు ఎవ్వరికీ ఎలాంటి హక్కులు లేవని శివశంకర్ అన్నారు.