బిజెపితో జనసేన పొత్తులోనే వుంది... పార్టీశ్రేణులు గుర్తించాలి..: నాదెండ్ల మనోహర్

By Arun Kumar PFirst Published Mar 29, 2021, 10:04 AM IST
Highlights

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం రాత్రి తిరుపతిలో జనసేన బిజెపి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని జనసేన‌-బిజెపి పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి గెలవాలని చూస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్   అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకే ఓట్లు పడేలా చేయాలనే కుతంత్రాలు జరుగుతాయి.. వాటిని అడ్డుకోవాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం రాత్రి తిరుపతిలో జనసేన బిజెపి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర కో ఇంచార్జ్  సునీల్ దేవధర్, తిరుపతి అభ్యర్థి రత్నప్రభ, బిజెపి ముఖ్యనేతలు ఆదినారాయణ రెడ్డి,  మధుకర్, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బిజెపి-జనసేన కూటమి పోరాడుతున్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లాలన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు ఏ విధంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోరాడారో... ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో అదే విధంగా పోరాడాలని నాదెండ్ల సూచించారు. 

read more   ఆంధ్ర ప్రదేశ్ కు అధిపతి అయ్యేది పవన్ కల్యాణే..: సోము వీర్రాజు

''భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో ఉంది. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్ధిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు కోసం బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్దాం. తిరుపతి లోక్ సభ స్థానంలో ఆమె ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా అందరం అండగా నిలబడదాం. రేపు ఆమె నెల్లూరులో నామినేషన్ వేస్తున్నారు. ఆ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అధ్యక్షుల ఆదేశాల మేరకు మనందరం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. రేపు, ఎల్లుండి తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. జనసైనికులందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి'' అని నాదెండ్ల పిలుపునిచ్చారు.  

''వైసీపీ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలే గెలుపిస్తున్నాయన్న మాట అవాస్తం. దానికి మొన్న జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల్లో కంటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది.  ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుందో వాటిపై ప్రతి ఒక్కరు కచ్చితంగా మాట్లాడాలి'' అన్నారు.

''టీటీడీ ఉద్యోగుల సమస్యను తీరుస్తామని ప్రభుత్వం చెప్పడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ఈ ఎన్నికలను అందరం చాలా సీరియస్ గా తీసుకొని రత్నప్రభ గెలుపు కోసం పూర్తిస్థాయిలో కృషి చేద్దాం. ఏ కార్యకర్తకు ఎక్కడ సమస్య వచ్చిన వెంటనే నాయకులకు ఒక్క మెసేజ్ చేయండి. వెంటనే దానిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి'' అని నాదెండ్ల తెలిపారు.

 

click me!