
వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. పదే పదే తన వ్యక్తిగత జీవితంపై మాటలేంటని ప్రశ్నించారు. జగన్ వ్యక్తిగత జీవితం గురించి ప్రతి చిన్న విషయం తనకు తెలుసునని కానీ.. తన సంస్కారం చిల్లరగా మాట్లాడనివ్వదన్నారు. హైదరాబాద్‌లో జగన్ ఏం చేశాడో తనకు తెలుసునని పవన్ చెప్పారు. మీ నాయకులు ఎవరినైనా పంపితే.. చెబుతానని, అది వింటే నీ చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త అంటూ జనసేనాని హెచ్చరించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే.. చూస్తూ ఊరుకోనని పవన్ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే జనసైనికులు బైక్ సైలెన్సర్లు తీసేసి తిరగడం తగ్గందని, వైసీపీ నేతలు కూడా వాళ్ల నోటికి సైలెన్సర్లు తగ్గిస్తే తమ వాళ్లు కూడా పూర్తిగా తగ్గిస్తారని పవన్ దుయ్యబట్టారు.
కులం పేరు తీసేసి.. తర్వాత క్లాస్ వార్ గురించి మాట్లాడాలని జగన్‌కు చురలంటించారు. కొండపల్లి సీతారామయ్యలా, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డిలా జగన్ మాట్లాడుతూ వుంటారని ఎద్దేవా చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య అసలు పేరు సుందరరామిరెడ్డి అని కానీ ఆయన తన పేరు చివరన వున్న తోక తీసేసి పేదల కోసం పనిచేశారని ప్రశంసించారు. జగన్ సీఎం అయిన నెల రోజులకే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని, 32 మంది ఆకలి చావులతో ఉరి వేసుకుని చనిపోయారని పవన్ దుయ్యబట్టారు.
తాను సంపాదించిన డబ్బును కౌలు రైతులకు ఇచ్చేశానని.. అలాంటి నేను క్లాస్ వార్ చేస్తున్నానా, ఈ ముఖ్యమంత్రికి సిగ్గుండాలంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో లేని నేను క్లాస్ వార్ చేస్తానా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుకను మూడు కంపెనీలకు కట్టబెట్టారని, 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే స్పందన లేదన్నారు. మీ పొట్ట కొట్టి మీ డబ్బు మీకే పంచుతున్నారని పవన్ పేర్కొన్నారు. కల్తీ మద్యాన్ని అమ్ముతూ.. ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు.
ALso Read: నిండా మునిగా చలేంటీ.. గోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై, చూసుకుందాం : జగన్‌కు పవన్ సవాల్
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం కష్టమని.. ఆడపడుచులు కోరుకుంటే కాలనీలు, గ్రామాలు, వీధుల వరకు మద్యం విక్రయాలు నిలిపివేస్తామని ఆయన పేర్కొన్నారు. జనసేన ప్రభుత్వంలో పాత ధరలకే మళ్లీ మద్యం అమ్ముతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. లిక్కర్ ఆదాయంలో గీత కార్మికులకు కొంత పంచుతామని ఆయన తెలిపారు. పార్టీలో శ్రామికులని పేరు పెట్టుకుంటే సరిపోదని.. మత్స్యకారుల జీవితాలను చిధ్రం చేసి గంగరం పోర్ట్ కట్టారని పవన్ దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారని మరి మిగతా కులా పరిస్థితి ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. భీమవరం డంపింగ్ యార్డ్‌కు వెళ్లానని, ఇక్కడ కనీసం 100 పడకల ఆసుపత్రి లేదని మండిపడ్డారు. ఇంత పెద్ద పట్టణానికి కనీసం రెండు ఫ్లై ఓవర్లు నిర్మించలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. మత్స్యకారుల్ని కొత్త ట్యాక్స్ పేరుతో దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ నాయకులు ఎవరినైనా విమర్శించొచ్చు కానీ.. మేం వాళ్లని విమర్శిస్తే మాత్రం వాళ్లకి ఒళ్లంతా చిల్లు పడిపోతుందంటూ ఫైర్ అయ్యారు.
గాంధీ గారు సత్య శోధన అనే పుస్తకం రాస్తే.. జగన్ అసత్య శోధన పేరుతో పుస్తకం రాస్తున్నారని సెటైర్లు వేశారు. తానే ప్రత్యర్ధులను ఎలా బెదిరించాను, 21 ఏళ్ల వయసులో ఎస్ఐ ప్రకాశ్ బాబును ఎలా కొట్టాను అనే వివరాలను అందులో రాస్తున్నారంటూ చురకలంటించారు. పోలీస్ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి పోలీసులను శాసిస్తున్నారని.. ఇలాంటి రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధం చేశారని జనసేనాని వ్యాఖ్యానించారు.