
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎన్నికలపై పడింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అక్కడ ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. వీరిలో అందరికంటే సీఎం జగన్ గేమ్ మొదలుపెట్టేశారు. గెలవరు అనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిర్ధాక్షిణ్యంగా పక్కనపెట్టేయడమో, వారి స్థానాలను మార్చడమో చేస్తున్నారు. బంధువులైనా, ఆప్త మిత్రులైనా సరే జగన్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకుండా నో చెప్పేస్తున్నారు. టికెట్లు కోల్పోయే నేతలను క్యాంప్ ఆఫీస్‌కి పిలిపించి వారిని బుజ్జగించే పనిలో వున్నారు జగన్, ఇతర కీలక నేతలు.
ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తమకు మైలేజ్ వచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధి పనులు తెలుగుదేశాన్ని గెలిపిస్తాయని తమ్ముళ్లు ధీమాతో వున్నారు. చంద్రబాబు సైతం తిరిగి రాజకీయాల్లో యాక్టీవ్ కావడం అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. వీటన్నింటికీ మించి ఇప్పుడు జనసేనతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తు వుంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరిగినా.. ఎన్నికలకు ఇంకా సమయం వుండగానే రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద అధికారికంగా పొత్తు ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్.
అప్పటి నుంచి చంద్రబాబు , పవన్‌లు పలు దఫాలుగా భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ, సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. సీట్ల విషయం ఓ కొలిక్కి రావడం లేదని టాక్. సీట్ల విషయమై రాజీ పడొద్దని.. కచ్చితంగా గెలిచే సీట్లనే తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు జనసేన నేతలు సూచిస్తున్నారు. సీట్లు పెంచుకుంటేనే డిమాండ్ చేయగల బలం వస్తుందని వారు గుర్తుచేస్తున్నారు. కూటమి గెలిస్తే మరో మాట లేకుండా సీఎం అయ్యేది చంద్రబాబు నాయుడేనని లోకేష్ వ్యాఖ్యానించడం కూడా పవన్‌పై ఒత్తిడికి కారణమవుతోంది. జనసేనకు పొత్తులో భాగంగా 27 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
కానీ ఈ షేరింగ్‌పై కాపులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ స్థాయిలో సీట్లు పొందడంతో ఎటువంటి ప్రయోజనం వుండదని వారు పవన్‌కు సూచిస్తున్నారు. 40 నుంచి 50 సీట్లు డిమాండ్ చేయాలని వారు కోరుతున్నారు. కూటమి గెలిస్తే సంఖ్యాబలాన్ని బట్టి టీడీపీ ఏకపక్షంగా సీఎం కుర్చీని సొంతం చేసుకునే అవకాశం వుందన్న అనుమానాల్ని కాపు పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. వీలైనంత బెట్టు చేసి టీడీపీ నుంచి సీట్లు పొందాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి 45 నుంచి 50 సీట్లను పవన్ కళ్యాణ్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారట. దీనిపై టీడీపీలో సైతం తర్జనభర్జన జరుగుతున్నట్లు సమాచారం. పవన్ డిమాండ్‌కు చంద్రబాబు అంగీకరిస్తారా అనేది చూడాలి.