ఆ సొమ్మెక్కడ.. రైతులను ముంచారు: జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 18, 2020, 6:53 PM IST
Highlights

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పంట అమ్ముకుని వారాలు గడుస్తున్నా ఇప్పటికీ సొమ్ములు రాక రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమం, భరోసా అంటూ ఎన్నికల సమయంలో వాగ్థానాలు చేసి అధికారంలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడం లేదన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు ఈ రోజు నాటికి రూ.2,016 కోట్లు చెల్లించాల్సి ఉందని.. ఈ మొత్తం రోజు రోజుకు పెరుగుతూ వస్తోందని పవన్ తెలిపారు.

Also Read:పవన్ కల్యాణ్ కట్టప్పను మించిపోయాడు: విజయసాయి రెడ్డి సెటైర్లు

లక్షమందికి పైగా రైతులు తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని.. రెండో పంట కోసం అవసరమైన పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయని జనసేనాని నిలదీశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దిగుబడి అమ్ముకున్న రైతులకు సొమ్మలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బుల గురించి అడుగుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రాకపోవడం పాలకుల బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు.

Also Read:అవసరమైతే ఇక్కడి నుంచి పోటీ చేస్తా: పవన్ కల్యాణ్

కొనుగోలు చేసిన 48 గంటల్లో పంట డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని జగన్ ప్రభుత్వం మరచిపోయిందని పవన్ ఎద్దేవా చేశారు. ధాన్యం అమ్మిన నెలరోజులకు కూడా సొమ్ము చేతికి రాక, రెండో పంటకు పెట్టుబడి లేక రైతులు అప్పుల పాలవుతున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఖరీఫ్ పంట కొనుగోలు, సొమ్ముల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా, ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో డిసెంబర్ నెలలోనే రైతు సౌభాగ్య దీక్ష ద్వారా వెల్లడించామని జనసేనాని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు కోసం నిధులను కూడా కేటాయించారా.. లేదా..? కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

click me!