మరొక్క ఛాన్స్ ఇస్తే.. పిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కొంటారు: వైసీపీ పాలనపై పవన్ సెటైర్లు

Siva Kodati |  
Published : Mar 14, 2022, 08:12 PM ISTUpdated : Mar 14, 2022, 08:15 PM IST
మరొక్క ఛాన్స్ ఇస్తే.. పిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కొంటారు: వైసీపీ పాలనపై పవన్ సెటైర్లు

సారాంశం

ఇప్పటంలో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తే చిన్న పిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కుంటారని దుయ్యబట్టారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ స్పష్టం చేశారు. 

అమరావతిని (amaravathi) రాజధానిగా ప్రతిపక్షంలో వుండి ఆనాడు ఒప్పుకున్నారని.... రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవని జనసేనాని (pawan kalyan) గుర్తుచేశారు.  గుంటూరు జిల్లా  ఇప్పటంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తూ.. జై ఆంధ్రా, జై తెలంగాణ  అంటూ పవన్ మాట్లాడారు. సీఎంలు మారినప్పుడల్లా  పాలసీలు మారవని... పాలసీల్లో తప్పోప్పులు వుంటే, సరిచేసుకుంటూ ముందుకెళ్లాలని పవన్ పేర్కొన్నారు. మూడు రాజధానులు అంటూ ఇప్పుడు చెబుతున్న  నేతలు ఆరోజు గాడిదలు కాస్తున్నారా అంటూ జనసేనాని దుయ్యబట్టారు. మూడు రాజధానుల గురించి ఆరోజు ఎందుకు మాట్లాడలేదని పవన్ ప్రశ్నించారు. రాజధానికి మరో వెయ్యి ఎకరాలు అదనంగా ఇవ్వాలని ఆనాడు జగన్ అన్నారని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని.. మీ మీద పడ్డ ప్రతి లాఠీదెబ్బ నా మీద పడ్డట్టేనని పవన్ అన్నారు. 

రాజధాని అమరావతి ఇక్కడి నుంచి కదలదని.. చివరికి న్యాయవ్యవస్థని కూడా తప్పుబట్టే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్లిందన్నారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించే అర్హత వైసీపీ నేతలకు ఎక్కడుందని పవన్ ప్రశ్నించారు. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలాగే వుంటుందన్నారు. నాయకుడికి వుండాల్సింది పట్టు, విడుపు అని.. ప్రశ్నించడమంటే మార్పుకు శ్రీకారమని పవన్ చెప్పారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని కూడా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని.. వెల్లంపల్లి వెల్లుల్లిపాయకు, బంతి చామంతి నేతలంటూ వైసీపీ నేతలపై పవన్ సెటైర్లు వేశారు. అమరావతి రైతుల పొట్ట మీద కొట్టారని.. పోలీసులకు కరువు భత్యాలు ఇవ్వకుండా వారిని వాడుకుంటున్నారని పవన్ ఆరోపించారు. పోలీసులకు వారాంతపు సెలవులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 

అంతకుముందు ఏపీ, తెలంగాణ నుంచి ఆవిర్భావ సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు  తెలిపారు. ఇప్పటం గ్రామ పంచాయితీకి తన వ్యక్తిగత ట్రస్ట్ తరపున 50 లక్షలు ప్రకటిస్తున్నా అన్నారు. రాజకీయాలపై అవగాహన కల్పించిన నాగబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గెలిచినా, ఓడినా జనసేనతోనే ప్రయాణం అన్న నాదెండ్ల మనోహర్‌కు పవన్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అలయ్ బలయ్ సంస్కృతి వుందని  ఆయన గుర్తుచేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలకు కూడా పవన్ నమస్కారాలు తెలియజేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా నా సంస్కారం నమస్కారం పెట్టమంటోందని ఆయన అన్నారు. వైసీపీలో బూతులు తిట్టే నేతలే కాకుండా మంచి నేతలు కూడా వున్నారని.. మేకపాటి గౌతంరెడ్డి, ఆనం, టీఎస్సార్‌కి కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతమందికి నమస్కారాలంటూ అది జనసేన సంస్కారమని.. ఒక పార్టీని నడపాలంటే డబ్బు కాదు, సైద్ధాంతిక బలం వుండాలని ఆయన అన్నారు. 2014లో జనసేనను స్థాపించానని, ఏడు శాతం ఓట్ల నుంచి ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి జనసేన ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశ్నించడం అంటే తేలిగ్గా తీసుకోవద్దని, ప్రశ్నించడం అంటే పోరాటానికి సన్నద్ధంగా వుండటమని ఆయన అన్నారు. 

2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేతలు కొందరు తొడగొడుతున్నారని.. తొడ కొట్టేవాళ్లని చూస్తే నాకు నవ్వొస్తోందన్నారు. వైసీపీ నాయకత్వంపైనా, మంత్రుల పైనా తనకు వ్యక్తిగత విభేదాలు లేవని పవన్ స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపనతో మొదలుపెడుతుందని.. కానీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభించిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్లపై పడేలా చేశారని.. ఇసుక పాలసీతో కార్మికుల జీవితాలు నాశనమయ్యాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇంత విధ్వంసపూరిత ఆలోచనతో ఈ నేతలు వున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి, ఏపీ ప్రజలు నా బానిసలు.. ఇదీ వైసీపీ నేతల భావన అంటూ పవన్ దుయ్యబట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరి ఆర్ధిక మూలాల్ని దెబ్బకొడతాం.. ఇసుకను  అప్పడంలా కరకర నమిలేస్తాం, గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం, సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా మద్యం ఆదాయం పెంచుకుంటాం, ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్తాం, ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూల్ పిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం.. ఇవీ వైసీపీ నేతలు చేసిన ప్రతిజ్ఞ అంటూ పవన్ చురకలు వేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu