
విశాఖపట్టణం: ఏపీలో భూదోపీడీ జరుగుతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. విశాఖలో లక్ష ఎకరాల భూమిని అడ్డగోలుగా కట్టబెట్టారని ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే భూకబ్జాలకు పాల్పడతారని చెప్పిన మీరు ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
విశాఖలో శనివారం నాడు జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన కవాతులో ఆయన పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీల అమలు సాధనే లక్ష్యంగా విశాఖలో జనసేన కవాతు నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. సీఎం కొడుకు సీఎం, డాక్టర్ కొడుకు డాక్టర్, యాక్టర్ కొడుకు యాక్టర్ , కూలీ కొడుకు కూలీగానే తమ జీవితాలను కొనసాగించాలా అని ఆయన ప్రశ్నించారు.
మీకు ఓట్లేసేది మా తలపై ఎక్కి తొక్కించుకోవడానికా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో భూదోపీడీ జరుగుతోందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూ దోపీడీని అడ్డుకోకుండా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ వస్తే భూకబ్జాలకు పాల్పడుతారని విమర్శించిన టీడీపీ నేతలు ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ నేతలు బరువు తగ్గడం కోసం నిరహార దీక్షలు చేస్తున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిరహారదీక్షలంటే వాళ్లకు అంత వెటకారంగా ఉందన్నారు.మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజుపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.
మీరు రాజులు.. సంస్థానాధీశులు.. పెద్దవాళ్లు నేనేమీ కాదనను గౌరవిస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి తాను ఉద్యమం చేస్తే తన గురించి తెలియదని ఆశోక్ గజపతిరాజు చెప్పిన మాటలను పవన్ ప్రస్తావించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి నిరహారదీక్ష చేస్తే రిసార్ట్స్ లో చేశానని కామెంట్ చేశారని ఆయన గుర్తు చేశారు. తన గురించి ఎమన్నా ఫరవాలేదన్నారు. కానీ ప్రజలను గురించి తప్పుగా మాట్లాడకూడదని ఆయన కోరారు.