కేసులు పెరుగుతున్నాయి.. కనిపించడం లేదా, మంత్రిగారూ: పాఠశాలల నిర్వహణపై పవన్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Jan 23, 2022, 7:01 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా కేసులు (coronavirus) పెరుగుతున్నా.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై (ap govt) జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరిగినప్పుడు విద్యా సంస్థలను మూసివేయడం గురించి చూద్దామని విద్యాశాఖ మంత్రి చెప్పిన రోజున రాష్ట్రంలో అధికారికంగా 4 వేల కేసులు ఉన్నాయని పవన్ గుర్తుచేశారు.

రాష్ట్రంలో కరోనా కేసులు (coronavirus) పెరుగుతున్నా.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై (ap govt) జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరిగినప్పుడు విద్యా సంస్థలను మూసివేయడం గురించి చూద్దామని విద్యాశాఖ మంత్రి చెప్పిన రోజున రాష్ట్రంలో అధికారికంగా 4 వేల కేసులు ఉన్నాయని పవన్ గుర్తుచేశారు. ఈ రోజు 14 వేలకు పైగా కేసులు వచ్చాయని.. మరి కేసులు పెరిగినట్లు కాదా విద్యా శాఖ మంత్రి గారు? ఇంకా ఎన్ని వేల కేసులు రావాలి... ఎన్ని లక్షల యాక్టీవ్ కేసులు ఉండాలి అని జనసేనాని ప్రశ్నించారు. పిల్లల ఆరోగ్య సంరక్షణలపై శ్రద్ధ లేకపోవడం వల్లే ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయని పవన్ ఎద్దేవా చేశారు.

కరోనా బారినపడుతున్న పిల్లల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని.. ఇప్పటికే పాఠశాలలకు పిల్లలను పంపించడం లేదని ఆయన గుర్తుచేశారు. కొన్ని స్కూల్స్‌లో తరగతికి ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉంటున్నారని.. కరోనాతో బాధపడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారని పవన్ తెలిపారు. కన్నవారు తమ బిడ్డలు కరోనా బారినపడకుండా చూసుకోవాలని ఆదుర్దాపడుతున్నారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండో వారం వరకూ విద్యా సంస్థలను మూసివేస్తే చిన్నారులను కరోనా నుంచి రక్షించుకొనే అవకాశం కలుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో సైతం విద్యా సంస్థలు తెరుస్తామంటే 60 శాతానికిపైగా తల్లితండ్రులు ఒప్పుకోవడం లేదని జనసేనాని గుర్తుచేశారు. 

ఫీవర్ సర్వేలు చెబుతున్న విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ప్రతి నలుగురిలో ఒకరు బాధపడుతున్నారని ఆ గణాంకాలు చెబుతున్నాయన్నారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది కూడా కరోనా బారినపడుతుండటంతో వైద్య సేవలకు అవాంతరాలు ఎదురవుతున్నాయని పవన్ తెలిపారు. జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని టెస్టింగ్ కిట్స్ కూడా అందుబాటులో ఉండటం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి వాస్తవ పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని నియంత్రణ చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

కాగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి.  గ‌త‌వారంలో ఐదు వేలు, ఆరు వేలు న‌మోదు అయినా కేసులు సంక్రాంతి   తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.  తాజాగా ఈరోజు 46,650  శాంపిల్స్‌ను పరీక్షించగా 14,440 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఇందులో అత్య‌ధికంగా.. విశాఖ జిల్లాలో 2258 కేసులు న‌మోదు కాగా..  చిత్తూరు జిల్లాలో 1198 కేసులు, అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరు జిల్లాలో 1458 కేసులు, ప్రకాశం జిల్లాలో 1399 కేసులు న‌మోద‌న‌ట్టు ఆర్యోగ నిపుణులు వెల్లడించారు. ఇతర జిల్లాల్లోనూ అదే స్థాయిలో కొత్త కేసులు గుర్తించారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,969 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,82,482 మంది కరోనాను జయించారు.

click me!