సార్.. సార్ అని అడుక్కోవాలి, మీ ఇగో శాటిస్‌ఫై అవ్వాలి.. నేను తలవంచేది లేదు: జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 20, 2022, 07:24 PM ISTUpdated : Feb 20, 2022, 07:28 PM IST
సార్.. సార్ అని అడుక్కోవాలి, మీ ఇగో శాటిస్‌ఫై అవ్వాలి.. నేను తలవంచేది లేదు: జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

సారాంశం

ఎంత పెద్దవాళ్లయినా సరే జగన్ వద్దకు వెళ్లి సర్ మీరు మాకు చేయాలి సర్ అని పిలవాలి.. మీ ఇగో శాటిస్‌ఫై అవ్వాలి, ఇదేమైనా ఫ్యూడలిజమా అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ.. తలవంచేందుకు కాదని పవన్ స్పష్టం చేశారు.

వైసీపీ (ysrcp) పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన (janasena) భయపడదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan) పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district) నర్సాపురంలో (narasapuram) ఆదివారం జరిగిన మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన మాట్లాడుతూ.. సంయమనమే తమ బలమన్నారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడుతానని పవన్ స్పష్టం చేశారు. బెదిరించే వైసీపీ నాయకులకు చెబుతున్నానంటూ ఆయన హెచ్చరించారు. సంయమనం తమ బలహీనత కాదని.. ఒక్కమాట మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడుతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయని.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గోతులమయం చేసిందన్నారు. 

మత్స్యకారులకు జీవో 217 పెద్ద సమస్యగా మారిందని.. రాష్ట్రంలో లక్షన్నర మంది మత్స్యకారులు వున్నారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. జనసేనకు పదిమంది ఎమ్మెల్యేలు వుంటే 217 జీవో వచ్చేది కాదంటూ దానిని వేదికపైనే చింపేశారు. దోపిడి చేసే చట్టాలను పాటించాల్సిన అవసరం లేదని.. మత్స్యకారుల కోసమే జీవోను చింపేశానని పవన్ చెప్పారు. తనను జైలుకు పంపితే పంపుకోవాలంటూ జనసేనాని సవాల్ విసిరారు. తాను చట్టాలను నమ్ముతానని.. కానీ ఇబ్బంది పెట్టే చట్టాలను ఉల్లంఘిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను భయపడేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. వంగి వంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదని ఆయన స్పష్టం చేశారు. 

చిన్న వలతో సముద్రంలోకి పోవాలంటే ఎంత సహసం వుండాలని.. మీ సాహసమే నాకు స్పూర్తి అని పవన్ కల్యాణ్ చెప్పారు. లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్ధండులని.. ఆ సమస్య పరిష్కరించమంటే మాత్రం కాలయాపన చేస్తారని మండిపడ్డారు. పెన్షన్లు , ప్రభుత్వ సాయం రాదంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని.. వైసీపీ నేతలు బ్రాందీ షాపు పక్కనే చీకుల కొట్టులు పెట్టుకోవాలంటూ పవన్ కల్యాణ్ చురకలు వేశారు. మీకు అధికారం ఇచ్చింది మటన్ కొట్లు, చికెన్ కొట్లు నడపమని కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పాదయాత్ర చేసింది మటన్ , చేపలు అమ్ముకోవడానికా అని పవన్ ప్రశ్నించారు. 

పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలేమయ్యాయని ఆయన మండిపడ్డారు. చట్టాలు మాకే వర్తిస్తాయా..? మీకు వర్తించవా అని ఆయన నిలదీశారు. ఏటా 25 వేల మంది మత్స్యకారులు ఏపీ నుంచి గుజరాత్‌కు వలస వెళ్తున్నారని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. వైసీపీ నేతల ఆలోచనల ఏంటంటే ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదు.. అందరూ దేహీ అని అడుక్కోవాలని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వ రాజ్యం కాదని పవన్ చురకలు వేశారు. 

వచ్చే ఎన్నికల్లో మీరు తనకు అండగా నిలబడాలని జనసేనాని కోరారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ.. తలవంచేందుకు కాదని పవన్ స్పష్టం చేశారు. ఎంత పెద్దవాళ్లయినా సరే జగన్ వద్దకు వెళ్లి సర్ మీరు మాకు చేయాలి సర్ అని పిలవాలి.. మీ ఇగో శాటిస్‌ఫై అవ్వాలి, ఇదేమైనా ఫ్యూడలిజమా అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మార్చి 14న కలుద్దామంటూ ఆయన మత్స్యకారులకు తెలిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున.. రాష్ట్రం ఏ విధంగా వుండాలనే దానిపై చర్చిద్దామన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?