
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రెండో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. జగన్మోహన్ రెడ్డిని ఈరోజు నుంచి గారు అనుకోకుండా నువ్వు అని పిలుస్తానన్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని.. వైఎస్ జగన్, వైసీపీ ఏపీకి సరైనవి కావన్నారు. వైఎస్ జగన్, వైసీపీకి మనం బానిసలు కాదని.. ఆయనా మనలో ఒకడు మాత్రమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మనం ట్యాక్సులు కడితే .. ఆ డబ్బుతో పాలన చేసే వ్యక్తని .. జగన్ కేవలం జవాబుదారీ మాత్రమేనని జనసేనాని పేర్కొన్నారు. 2024లో వైసీపీ, వైఎస్ జగన్ రాష్ట్రానికి అవసరం లేదని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు.
తాను రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతుంటే.. వైసీపీ నాయకులు తన తల్లి, ఇంట్లో ఆడవాళ్లు, పిల్లల గురించి మాట్లాడుతూ అవమానిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చూశారు. జగన్ మంచోడో, చెడ్డాడో ఇన్నాళ్లు జగన్ రెడ్డి గారని గౌరవించానని ఆయన గుర్తుచేశారు. హల్లో ఏపీ.. బై బై వైసీపీ అనే నినాదం తనది కాదని ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని దెబ్బలు, ఇన్ని అవమానాలు పడాలి అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాను సరదాగా రాజకీయాల్లోకి రాలేదని.. ఓటమి వచ్చినా పర్లేదని పోరాటానికి సిద్ధపడ్డానని ఆయన తెలిపారు.
తాను ఏం మాట్లాడినా వక్రీకరించి, వంకరగా, వెకిలిగా మాట్లాడతాడంటూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. తాను ఏం మాట్లాడిన రాష్ట్ర ప్రజల కోసమే మాట్లాడతానని తెలిపారు. యువతీ, యువకుల ఉద్యోగ సమస్యలు, ఆడపడుచుల రక్షణ, రోడ్లు, గంజాయి సమస్యలు ఇలా ఎన్నో వున్నాయని పవన్ తెలిపారు.