టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఏ పథకం ఆగదని, మరింత సంక్షేమం అందించేందుకు కృషి చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సొంత డబ్బును పేదల కోసం ఖర్చు పెడుతున్నానని.. సంక్షేమ పథకాలు ఎలా ఆపుతామని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే పథకాలు ఆగిపోతాయంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ బుధవారం రూ.5 లక్షల బీమా చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఏ పథకం ఆగదని, మరింత సంక్షేమం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మరింతగా అందజేస్తామే తప్పించి.. ఏ పథకం ఆగదని జనసేనాని స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాల మాఫీపై అధ్యయనం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
సొంత డబ్బును పేదల కోసం ఖర్చు పెడుతున్నానని.. సంక్షేమ పథకాలు ఎలా ఆపుతామని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చే రూ.5 లక్షలు పెద్ద మొత్తం కాదని , కానీ వారికి ఏదో విధంగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి మరింత పనిచేసే ఆలోచన చేస్తున్నామని.. ఇందుకోసం ఓ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని జనసేనాని వెల్లడించారు. చనిపోయిన కార్యకర్తల పిల్లలను చదివించాలనే ఆలోచన వుందని, జనసేనకు వున్న మానవతా ధృక్పథానికి అధికారం తోడైతే ఇంకా బాగుంటుందని పవన్ పేర్కొన్నారు.