
ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తుపై సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారని.. ఈసారి నవంబర్, డిసెంబర్‌లలోనే ఎన్నికలు జరుగుతాయని పవన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమీషన్‌తోనూ జగన్ మాట్లాడుకుంటున్నారని జనసేనాని ఆరోపించారు. 600 పోస్టుల్లో 550 పోస్టులను ఒక కులానికే ఇవ్వనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన కులాన్ని గౌరవించుకుంటూనే, ఇతర కులాల వారికి దక్కాల్సినవి అందజేస్తానని ఆయన తెలిపారు.
మన మధ్య గొడవలు పెట్టేందుకు జగన్ ఎస్సీలు, బీసీ నేతలతో తనను తిట్టుస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించి ఎంతోమంది వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం లేకుండా చేశారని మండిపడ్డారు. ఓట్లు వేసేటప్పుడు కులాలవారీగా విడిపోవద్దని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 56 బీసీ కార్పోరేషన్లను పెట్టారని.. బీసీ సబ్ ప్లాన్‌కు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రూపాయి అవినీతి చేయనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనని పేర్కొన్నారు.
ALso Read: మూడు రాజధానుల పేరుతో జగన్నాటకం.. అమరావతే ఏపీకి రాజధాని , జనసేన స్టాండ్ ఇదే : తేల్చేసిన పవన్
దళితులకు పథకాలు రద్దు చేసి అంబేద్కర్ విగ్రహాలు పెడితే సరిపోతుందా అని పవన్ ప్రశ్నించారు. దళిత యువకుడిని చంపిన నేతను వదిలేశారని ఆయన ఆరోపించారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో తాను కూడా ఒకడినని పవన్ తులిపారు. కులాలు చూసి ఓట్లు వేయొద్దని.. మనుషులను చూసి ఓట్లేయాలని ఆయన కోరారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి మాట్లాడానో, ఇసుక దందాను ఎత్తిచూపానో అప్పటి నుంచి వైసీపీ వాళ్లు తనను తిట్టని రోజు లేదన్నారు. వైసీపీ వాళ్ల పర్సనల్ విషయాలు తనకు తెలుసునని, వైసీపీ నేతలకు ఇంటెలిజెన్స్ కావాలి తనకు అభిమానులు చాలని పవన్ పేర్కొన్నారు. సగటు మనిషికి న్యాయం చేయాలని అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు.