మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల ముఖ్యమంత్రి.. నేను భయపడాలా : జగన్‌పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 12, 2023, 7:20 PM IST
Highlights

మూడు ముక్కల ప్రభుత్వం .. మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినో తిట్టడానికి ఈ సభ పెట్టలేదన్నారు. మహా అయితే ప్రాణం పోతుందని.. కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడినవుతానని పవన్ అన్నారు.

మూడు ముక్కల ప్రభుత్వం .. మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్న వాడినని జనసేనాని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు.. పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టాలని చెప్పానని పవన్ గుర్తుచేశారు. ఆ తర్వాత మీ నాన్న మనుషులు తనపై దాడులు చేశారని, భయపెట్టారని, మహబూబ్‌నగర్‌లో తన స్టేజ్‌లు కూల్చేశారని.. తనను తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని జనసేనాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ప్రతి వెధవ, సన్నాసి చేత తాను ఇవాళ మాటలు పడుతున్నానని పవన్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తనకు ఆ బాధ లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాకపోతే.. తనను తిట్టే వాళ్లు కూడా తనతో ఫోటోలు దిగేవాళ్లేనని పవన్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి తిట్టించుకోవడం కూడా తాను విజయంగానే భావిస్తానని జనసేనాని స్పష్టం చేశారు. తన కోసం కాకుండా , తన సాటి మనిషి కోసం జీవించే జీవితం గొప్పదని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే ప్రజల్ని బానిసల్లా చూసే వ్యక్తిత్వాలు తనకు చిరాకని పవన్ అన్నారు. సమాజం, దేశం కోసం ముందుకు రావాలని నిర్ణయించుకున్నానని జనసేనాని స్పష్టం చేశారు.

మహా అయితే ప్రాణం పోతుందని.. కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడినవుతానని పవన్ అన్నారు. యువతలో కోపం వుంది, కానీ భయం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నేతలకు భయపడనక్కర్లేదని పవన్ స్ఫష్టం చేశారు. ఇది కళింగాంధ్ర కాదని.. కలియబడే ఆంధ్ర అన్న ఆయన.. మీరు మౌనంగా వుంటే ఎలా అని ప్రశ్నించారు. పోరాటం చేయడం, వెధవల్ని ఎదుర్కోవడం తనకు బాగా తెలుసునని పవన్ స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకు రాజకీయాలను వదలనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గూండాగాళ్లను ఎలా తన్నాలో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. తన సభలకు వచ్చే యువతను చూసి మార్పు వస్తోందని అనుకున్నానని.. కానీ ఓట్లు వేసే సమయానికి అంతా తనను వదిలేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!